News

ఎన్.కొత్తపల్లిలో సాకారమైన సరస్వతి ధామం కల

563views

నంద్యాల: నంద్యాల జిల్లా పరిసర గ్రామమైన ఎన్. కొత్తపల్లి శ్రీశ్రీశ్రీ ప్రమోదు చైతన్య స్వామి వారు ఈ ప్రాంత చిన్నారుల విద్యాభివృద్ధి తో పాటు, సాంస్కృతిక, ధార్మిక అభివృద్ధిని కాంక్షించారు. ఇందులో భాగంగా శ్రీ సరస్వతీ విద్యా పీఠానికి అందజేసిన చైతన్య క్షేత్రాన్ని, ఆయన కల సాకారం చేసే దిశగా ” ఇంతింతై వటుడింతై ” అన్నట్లు పంట పొలాలను పూరి గుడిసెలుగా, పూరిగుడిసెలను రేకుల షెడ్డుగా, రేకుల షెడ్డు ను ప్రస్తుత కార్పొరేట్ స్థాయిలో సకల హంగులతో నిర్మించారు.

ఈ సుదీర్ఘ ప్రస్థానం భూరి విరాళాలతో కొనసాగడం విశేషం. నేడు పూజ్య స్వామీజీ శ్రీశ్రీశ్రీ ప్రమోద చైతన్య, స్థానిక పార్లమెంట్ సభ్యుడు పోచ బ్రహ్మానంద రెడ్డి, డాక్టర్ జి.రామకృష్ణ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల మొదటి అంతస్తు, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతి గది ప్రారంభ‌మ‌య్యాయి. ఇవ‌న్నీ రాబోవు కాలంలో ఈ ప్రాంత విద్యార్థులకు ఎనలేని సేవలు అందించనున్నాయి.

స్థానిక సంఘమిత్ర ప్రాయోజితమైన కంప్యూటర్ శిక్షణ కేంద్రం పాఠశాల సమయంలో విద్యార్థులకు అందుబాటులో ఉండటంతో పాటు, పాఠశాల అనంతరం పరిసర గ్రామాల విద్యార్థులకు శిక్షణ అందించనుంది. ఈ గ్రామ పరిసర పది గ్రామాల ప్రజలు వ్యవసాయ ప్రధానంగా జీవనం సాగిస్తున్నారు.

ఈ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక, ధార్మిక జీవన విధానంలో సకారాత్మక మార్పులను లక్ష్యిస్తూ ఎన్నో ప్రకల్పాలు పురుడు పోసుకోనున్నట్టు సంఘ విభాగ్ కార్యకారిణి సభ్యుడు డాక్టర్ ఉదయశంకర్ తెలిపారు.

ప్రధాన వక్తగా విశ్రాంత ఐఏఎస్ అధికారి చామర్తి ఉమామహేశ్వరరావు పాల్గొని చదువుతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పి, విద్యార్థి సంపూర్ణ సకారాత్మక మూర్తిమత్వానికి దోహదం చేసే ఇలాంటి విద్యాలయాల ఆవశ్యకతను వివ‌రించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ గెలివి సహదేవుడు, డాక్టర్ లక్ష్మీ సౌజన్య దంపతులు, డాక్టర్ భార్గవ్ వర్ధన్ రెడ్డి,
తులసి రెడ్డి, ప్రబంధ కారిణి, సలహా సమితి, విద్వత్ సమితి, నిర్మాణ సమితి, కార్యకారిణి సభ్యులు, దాతలు, పోషకులు, ఆత్మీయులు పాల్గొన్నారు

ఈ బృహత్ నిర్మాణ కార్యక్రమాన్ని కరోనా లాంటి అననుకూల పరిస్థితుల్లో కూడా అందరిని సమన్వయ పరుచుకుంటూ నిరాటంకంగా కొనసాగించిన విభాగ్ ధర్మజాగరణ ప్రముఖ రాంప్రసాద్ సేవలను డాక్టర్ ఉదయ శంకర్ ప్రత్యేకంగా ప్రస్తుతించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి