
* వరద బాధితుల సహాయార్థం వరద ప్రభావిత గ్రామాలలో పర్యటించనున్న జయభారత్ హాస్పిటల్ వైద్య బృందాలు
గోదావరి జిల్లాలలో నెలకొన్న వరదల కారణంగా నిరాశ్రయులైన వారి సహాయార్థం సేవాభారతి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు నెల్లూరు జయభారత్ హాస్పిటల్ కూడా తోడైంది. వరద బాధితులకు వైద్య సహాయాన్ని అందించడం కోసం సింహపురి వైద్య సేవా సమితి, జయభారత్ హాస్పిటల్ ల సంయుక్త ఆధ్వర్యంలో వైద్య బృందం ఒకటి బయలుదేరి వెళ్ళింది. అవసరమైనవారికి ఉచితంగా పంపిణీ చేయడం కోసం ఈ బృందం తమతో పాటు 2 లక్షల రూపాయల విలువైన మందులను తీసుకెళ్ళింది. సుమారు 500 కుటుంబాలకు సరిపోయేలా 3 లక్షల రూపాయల విలువచేసే దుస్తులను కూడా ఈ బృందం తమతో తీసుకెళ్ళింది. సింహపురి వైద్య సేవా సమితి సభ్యులు డాక్టర్ సి వి సుబ్రహ్మణ్యం జెండా ఊపటంతో వాహనాలు బయలుదేరాయి. డాక్టర్ చైతన్య ఆ వైద్య బృందానికి సారథ్యం వహిస్తారు.
వరద బాధితుల సహాయార్థం శ్రీ పొన్నలూరి సీతారామిరెడ్డి 1 లక్ష రూపాయలు, శ్రీమతి మాగుంట స్నేహలత 22,500 రూపాయలు విరాళంగా అందజేశారు.
ఎక్కడ ప్రకృతి విపత్తులు సంభవించినా తమ సంస్థ ముందుండి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని సింహపురి వైద్య సేవా సమితి ఉపాధ్యక్షులు శ్రీ బాలు సుబ్బారావు తెలిపారు. ఈ విధంగా వైద్య బృందం బయలుదేరుతున్న విషయం తెలుసుకుని బాధితుల సహాయార్థం అనేకమంది తమకు మందులను అందజేశారని తెలుపుతూ వారందరికీ సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు వెళ్ళిన వైద్య బృందం వరద ప్రభావిత ప్రాంతాలలో నాలుగు రోజులపాటు తమ సేవలు అందిస్తుందని, అనంతరం మరో వైద్య బృందం అక్కడికి వెళుతుందని శ్రీ సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహపురి వైద్య సేవా సమితి కోశాధికారి శ్రీ గుఱ్ఱం సుధాకర్, జయభారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ శ్రీ గురుప్రసాద్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివ మౌర్య, డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.