![](https://vskandhra.org/wp-content/uploads/2022/07/MURMU.jpeg)
ఇటీవల నిండు పార్లమెంట్ సభలో దేశ అత్యున్నత పదవిలో ఉన్న గౌరవ రాష్ట్రపతిని కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి ‘రాష్ట్రపత్ని’ అని వ్యంగ్యంగా సంబోధించి అవమానించాటాన్ని, దాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టి కాంగ్రెస్ ను క్షమాపణ కోరటాన్ని మనం చూశాం. ఆదివాసీలపై కాంగ్రెస్ చిన్నచూపు ఈనాటిది కాదు. దశాబ్దాలుగా ఆదివాసీలపట్ల కాంగ్రెస్ అనుసరిస్తూ వస్తున్న అవమానకర, అణచివేత వైఖరికి కొనసాగింపే ఇప్పటి కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు. ఆ క్రమంలో కాంగ్రెస్ అత్యంత నిరంకుశంగా, అమానవీయంగా వ్యవహరించింది. అనేకమంది అమాయక ఆదివాసీలను అన్యాయంగా పొట్టనపెట్టుకుంది. ఆదివాసీల పక్షం వహించి వారి హక్కుల కోసం పోరాటం సాగించిన బస్తర్ రాజు ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్ ను బలితీసుకుంది. అంతకముందు ఆదివాసీల పక్షం వహించిందన్న కారణంగానే ఆయన తల్లి మహారాణి ప్రపుల్ల కుమారిని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్ని అత్యంత దుర్మార్గంగా అడ్డు తొలగించుకుంది. విదేశీ ఆంగ్లేయ పాలకులు సరే… స్వదేశీ కాంగ్రెస్ పాలకులు కూడా ఆదివాసీలపై అమానుషంగా ప్రవర్తించటం వారి వలస పాలనా విధానాల కొనసాగింపుకి ఒక ప్రబల తార్కాణం. ఈ నేపథ్యంలో 26/7/2022 మంగళవారం నాడు ఆంధ్రప్రభలో ప్రచురితమైన శ్రీ వుప్పల నరసింహం వ్రాసిన వ్యాసంలోని కొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….
జల్, జంగల్, జమీన్ బస్తర్ ఆదివాసులదేనని తొలిసారిగా నినదించి, ఉద్యమించి, ప్రాణాలు అర్పించింది బస్తర్ రాజు ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్. ఆ రాజు ఆదివాసీలతో జట్టుకట్టి, వారిలో ఒకనిగా మెలుగుతూ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సన్నద్ధమవుతున్నాడని, భావించిన అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆయనపై కక్షకట్టి 1966లో మార్చి 24తేదీన ఆయనను కాల్చి చంపించింది. ఇది ఎన్ కౌంటర్ కాదు. రాజప్రాసాదంలో ఆయన పడకగదిలోనే పోలీసులు ఆయనను కాల్చిచంపారు. అప్పటికి ఆయన వయసు కేవలం 37 సంవత్సరాలు. ఆయన రాయ్ పూర్, లండన్లలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ప్రపంచ పోకడలనూ, ప్రజల చైత న్యాన్ని, పరిశీలించి బస్తర్ ఆదివాసీల హక్కుల పరిరక్షణ, సాధికారత కోసం స్వరం పెంచారు. దాంతో ప్రభుత్వం ఆయన ప్రాణాలు తీసింది. రాజమహల్లో పట్టపగలే ఈ దుర్ఘటన జరగడంతో అక్కడే ఉన్న ఆదివాసీలు ఆగ్రహంతో ఊగిపోతూ తూటాలు వచ్చిన వైపు పదు నైన బాణాలు వదిలారు. కొందరు పోలీసులు గాయ పడ్డారు. ఈ ప్రతిచర్యకు రెచ్చిపోయిన పోలీసులు విచక్ష ణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఆదివాసీలు పిట్టల్లా నేలకొరిగారు. అనంతరం అక్కడ నిషేధాజ్ఞలు విధించి, మిగతా ఆదివాసీలను చెదరగొట్టి భయభ్రాంతులను సృష్టించి శవాలను ట్రక్కులలో తీసుకెళ్ళి ఇంద్రావతి నదిలో విసిరేశారని కొందరు, ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చేశారని మరికొందరు చెప్పుకున్నారు. ఇప్పటికీ ఆ మాటలు ప్రజల నోట ప్రతిధ్వనిస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం దేశంలో 1967లో నక్సల్ బరీలో రైతాంగ ఆందోళన ప్ర్రారంభం కావతానికన్నా చాలా ముందే బస్తర్లో ఆది వాసీల హక్కుల కోసం, వారి ప్రధాన నినాదమైన జల్, జంగిల్, జమీన్ కోసం బస్తర్ రాజు ప్రవీర్ చంద్ ప్రాణాలర్పించి అమరుడయ్యారు. ఆయన మద్దతుదారులు సైతం అసువులు బాశారు. దేశ చరిత్రలో ఓ రాజు తన ప్రజల కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించడం అపూర్వం, అసాధారణం. వాస్తవానికి రాజుకోసం సాధారణ పౌరులు, ప్రజలు ప్రాణాలు అర్పిస్తారు. కానీ, బస్తర్లో ఆ సంప్రదాయం తిరగబడింది. అలా ఆ రాజు బస్తర్ ఆదివాసీల గుండెల్లో గూడుకట్టుకున్నాడు. నేడు ప్రవీర్ చంద్ర భంజదేవ్ చిత్ర పటాన్ని ప్రజలు దంతేశ్వరి ఆలయంలో అమ్మవారి విగ్రహం పక్కన పెట్టి పూజిస్తున్నారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందంటే ఆ రాజుపట్ల ఆదివాసీ ప్రజల ప్రేమ, ఆదరాభిమానాలు ఎలా ఉన్నాయో ఇట్టే ఊహించవచ్చు. అంతేకాక, ప్రతి ఏటా ఆయన వర్ధంతిని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఆయన పేరిట ఒక సేనను కూడా ఏర్పాటు చేశారు. ఆయ న ఆశయాల సాధన కోసం విస్తృతంగా సేవా కార్యక్రమా లను నిర్వ హిస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాల్లో తమ రాజును వారు సజీవంగా చూసుకుంటున్నారు.
ఇక ప్రవీర్ చంద్ భంజ్ దేవ్ తల్లి, బస్తర్ సంస్థానాధీశురాలు మహారాణి ప్రపుల్ల కుమారిని సైతం బ్రిటిష్ పాలకులు కక్ష కట్టి కుట్ర పూరితంగా ఇలాగే హత్య చేశారు. స్వల్ప అనారోగ్యంతో చికిత్స కోసం ఆమె రాయ్ పూర్ ఆస్పత్రిలో చేరగా ఇదే అదనుగా భావించి ఆమెను అడ్డు తొలగించుకునే మార్గం, ఉపాయం ఆలోచించి రాణిని లండన్ కి తరలించారు. అక్కడ తప్పుడు శస్త్ర చికిత్స చేసి ఆమెను పొట్టన పెట్టుకున్నారు. ఆ ఆధారాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. బస్తర్ ఆదివాసీలకోసం తపన చెంది పాలకులకు కంటకింపు అయి చివరకు అమరులయ్యారామె. అలా తల్లీ కొడుకులిద్దరూ ఆదివాసుల సంక్షేమం, సాధికారత కోసం ప్రాణాలు అర్పించడం చరిత్రలో చాలాగొప్ప విషయం. ప్రపంచంలో ఇలాంటిది ఎక్కడా జరిగి ఉండదు. తల్లి మరణం నాటికి ప్రవీర్ చంద్ చాలా చిన్నవాడు. అతడు గద్దెనెక్కడానికి వీలు లేకుండా అనేక అవరోధాలు, అడ్డంకులు సృష్టించారు. దాంతో యుక్త వయసు వచ్చే వరకూ ఆయన ఇతర ప్రాంతాల్లో సంరక్షకుల చెంత పెరిగారు.
బస్తర్ తిరిగొచ్చిన ఆయనలో అన్నీ తల్లి గుణాలు, లక్షణాలు ప్రస్ఫుటమయ్యాయి. అలా ఆదివాసీల్లో చైతన్యం కోసం, వారి హక్కుల కోసం, జల్ జంగిల్, జమీన్ అన్న నినాదాన్నిచ్చారు రాజా ప్రవీర్ చంద్ర. ఆయనఆజానుబాహువు. ఆంగ్లం, సంస్కృతం, హిందీ తదితర భాషలను అనర్గళంగా మాట్లాడటం, చదవడం, వ్రాయడం వల్ల ఆయన వ్యక్తిత్వం చాలా మందిలో అసూయను పెంచింది. పర్యవసానంగా ఆనాటి ప్రభుత్వం ఆయనను దారుణంగా రాజమహల్లోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళేలా చేసింది. ఇదీ… వుప్పల నరసింహం గారి ఆవేదన. అయితే తాజాగా ఆదివాసీ మహిళ శ్రీమతి ద్రౌపది ముర్ము 15వ రాష్ట్రపతి కావడం ఒక ఆశావహ సంకేతమని ఆయన ఆ వ్యాసంలో అభిప్రాయ పడ్డారు.
అట్టడుగు వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు, హక్కుల పరిరక్షణ కోసం అవిశ్రాంత కృషి సల్పుతానని శ్రీమతి ముర్ము కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. శ్రీమతి ముర్ము ఎంపికను, విజయాన్ని, ఆమె పదవీ స్వీకారాన్ని వనవాసీల వికాసము, చైతన్యం కోసం దేశవ్యాప్తంగా పనిచేస్తున్న వనవాసీ కల్యాణాశ్రమ్ స్వాగతించింది. శ్రీమతి ముర్ము హయాంలో రాబోయే రోజులలో వనవాసీలు, నగరవాసుల జీవితాలు మాత్రమే కాక యావత్ దేశం గౌరవాన్ని, వైభవాన్ని సంతరించుకుంటుందన్న ఆశాభావాన్ని వనవాసీ కళ్యాణాశ్రమ్ వ్యక్తం చేసింది. శ్రీమతి ముర్ము పదవీ స్వీకారం, ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అనే కేంద్ర ప్రభుత్వ నినాదము, విధానాల ద్వారా రాజా ప్రవీర్ చంద్, ఆయన తల్లి మహారాణీ ప్రపుల్ల కుమారిలు కన్న కలలు సాకారమయ్యే అవకాశాలు మన కనులముందు స్పష్టంగా గోచరిస్తున్నాయి. శివసుందర నవ సమాజం నిర్మాణమవుతుందనే ప్రగాఢ విశ్వాసం కలుగుతోంది.