
-
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది అసెంబ్లీ వేదికగానే అత్యాచారంపై మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి.
గాంధీలు, నెహ్రూ పేరుతో కాంగ్రెస్ నేతలు కావాల్సినంత డబ్బు సంపాదించారని పేర్కొన్నారు. సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించటాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనల వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీల పేరుతో మనం 3-4 తరాలకు సరిపడా డబ్బు సంపాదించుకున్నాం. మనం ఈమాత్రం త్యాగం చేయలేకపోతే.. అది మనకే మంచిది కాదు.’ అని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కే. ‘కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్ళలో ఏ విధంగా దేశాన్ని దోచుకుందనే విషయాన్ని ఎంతో అందంగా వివరించిన తెలివైన నేతకు నా శుభాకాంక్షలు’ అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.





