తిరువనంతపురం: కేరళ తుపాకులు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న తమిళనాడులోని 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. చెన్నైలోని 9, తిరుచ్చిలో 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. గతేడాది కేరళలోని వెలిచంలో 300 కిలోల హెరాయిన్, ఐదు ఏకే 47 తుపాకులు, తూటాలు దొరికాయి. ఈ కేసును గతేడాది మేలో ఎన్ఐఏకు బదిలీ చేయగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురు శ్రీలంక దేశస్థులను అరెస్ట్ చేశారు. ఎల్టీఈ ఉద్యమానికి సంబంధించిన అనేక పత్రాలు, సిమ్ కార్డులను సీజ్ చేశారు.
మరోవైపు నేరచరిత్ర కలిగిన విదేశీయులపై కూడా జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు చేపట్టింది. తిరుచ్చిలో నివసిస్తున్న శ్రీలంక, బల్గేరియా, దక్షిణ కొరియా, రష్యా, యూకే, బంగ్లాదేశ్, కెన్యా దేశాలకు చెందిన 100కు పైగా నేరస్థుల ఇళ్ళలో సోదాలు చేసింది. ఎన్ఐఏ అధికారులతోపాటు స్థానిక పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు.
జమ్ములోనూ ఎన్ఐఏ దాడులు
జమ్ములోని శ్రీనగర్లో మేలో లభ్యమైన 15 పిస్టళ్ళ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాడులు చేపట్టింది. పుల్వామా, శ్రీనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించింది. మే 23న 15 పిస్టళ్లతో పారిపోతున్న ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు టీఆర్ఎఫ్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు.
Source: EtvBharat