
445views
తిరుపతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో కొండచరియలు విరిగిపడే ఘటనలకు చెక్ పెట్టేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) భారీ కార్యక్రమాన్ని చేపట్టనుంది. కొండ ప్రాంతాలు సర్వే చేసి బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి సూచనలు చేయనుంది.
స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బండ్లగూడలోని జీఎస్‌ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ దక్షిణాది విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ జనార్దన్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. దేశంలో 7–8 ఏళ్లుగా పర్వత సానువుల సర్వే కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది తిరుమల కొండలనూ సర్వే చేయనున్నామని తెలిపారు. అంతేకాకుండా తిరుమల కొండలపై వాననీటి ప్రవాహాలను గుర్తించి వాటి ద్వారా కొండలు బలహీన పడకుండా ఉండేలా తగిన పరిష్కార మార్గాలనూ సూచిస్తామని వివరించారు.





