News

షార్ట్ కట్ పాలిటిక్స్‌తో దేశానికి నష్టం: మోడీ

462views

ఝార్ఖండ్‌: రాజకీయాల్లో షార్ట్‌కట్స్ దేశాన్ని నాశనం చేస్తాయ‌ని ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. ఝార్ఖండ్‌లోని డియోగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన సందర్భంలో అక్కడి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కొత్త ఎయిమ్స్‌ ఆసుపత్రిని ప్రారంభించారు. “షార్ట్‌కట్ రాజకీయాలకు దూరంగా ఉండి. ఇవే షార్ట్‌సర్క్యూట్‌లకు దారి తీస్తాయి” అని అన్నారు ప్రధాని మోదీ. ఇదే సమయంలో “ఉచిత” హామీల గురించీ ప్రస్తావించారు. ఉచిత హామీలు కొత్త విమానాశ్రయాలను, ఆసుపత్రులను నిర్మించలేవని విమర్శించారు. “అన్నీ ఉచితంగానే అందిస్తే, దేశానికి అవసరమైన ఎయిర్‌పోర్ట్‌లు, ఆసుపత్రులు ఎలా కడతారు” అని ప్రశ్నించారు.

ఓ నిర్మాణం పూర్తయ్యేలోపు ఎన్నో ప్రభుత్వాలు మారిపోతాయ్..

దేశంలోనే అత్యంత వెనకబడిన రాష్ట్రంగా ఉంది ఝార్ఖండ్. ఇలాంటి చోట ప్రభుత్వం ఇష్టారీతిన ఉచిత హామీలు అందించింది. సీఎం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎన్నో సబ్సిడీలూ ప్రకటించారు. ఢిల్లీ తరహాలోనే ఝార్ఖండ్‌లోనూ ప్రతి ఇంటికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. రైతుల రుణమాఫీ లాంటి ఇతర పథకాలూ అమల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎన్నికల హామీలే. వీటిని నెరవేర్చటం కోసం కిందామీదా పడుతోంది అక్కడి ప్రభుత్వం. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

“గతంలో ఒక ప్రభుత్వం హామీ ఇస్తే, రెండు మూడు ప్రభుత్వాలు మారాక అది నెరవేర్చేందుకు పనులు మొదలు పెట్టేవారు. ఒకరు ఫౌండేషన్ స్టోన్ వేస్తే, తరవాతి ప్రభుత్వాలు ఇటుకలు వేసేవి. ఎన్నో ప్రభుత్వాలు మారితే తప్ప అసలు నిర్మాణం పూర్తయ్యేది కాదు” అని మోడీ ఎద్దేవా చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి