
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి రేసులో ఇద్దరు భారత సంతతి నేతలు నిలిచారు. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం రూపొందించిన తుది జాబితాలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్, అటార్నీ జనరల్ సుయెలా బ్రావెర్మన్ చోటుదక్కించుకున్నారు. భారత సంతతికి చెందిన మరో కీలక నేత, హోం మంత్రి ప్రీతి పటేల్ మాత్రం తాను పోటీకి దూరంగా ఉంటున్నట్టు ముందే ప్రకటించారు.
ప్రస్తుతానికి తన దృష్టంతా హోం శాఖ బాధ్యతల నిర్వహణపైనే ఉందన్నారు. ప్రధాని పదవికి సునాక్, బ్రావెర్మన్ సహా మొత్తంగా ఎనిమిది మంది పోటీలో నిలిచారు. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, ఆర్థిక శాఖ నూతన మంత్రి నదీమ్ జహావా, వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్, మాజీ మంత్రులు కెమీ బదెనోచ్, జెరెమీ హంట్, మరో నేత టామ్ టుగెంధాట్‌లు ఈ జాబితాలో ఉన్నారు. అత్యధిక మంది ఎంపీలు సునాక్‌ను బలపరిచినట్టు సమాచారం.





