-
పూజలకు అనుమతి ఇవ్వాలని హిందువుల తరుపు న్యాయవాది వాదన
వారణాసి: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదులోని దేవతామూర్తులకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ వారణాసి కోర్టును ఆశ్రయించారు.
దీనిపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదాన్ని వారణాసి జిల్లా కోర్టులో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మే 30న ఇరుపక్షాల వాదనలు విన్న వారణాసి జిల్లా కోర్టు కేసును నేటికి వాయిదా వేసింది. దీంతో తాజాగా ఈ రోజు ముస్లింల తరుపున వాదనలు కొనసాగుతాయి. ముస్లిం పక్షాన న్యాయవాదులు ఈ కేసు సరైనది కాదని, డిస్మిస్ చేయాలని కోరుతున్నారు. అయితే, హిందూ లాయర్ విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ మేం అక్కడ పూజలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, మా డిమాండ్ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని అన్నారు.
ఇదిలా ఉంటే అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ జ్ఞానవాపి మసీదు కేసు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని అతిక్రమిస్తుందని వాదిస్తున్నారు. ఈ వివాదంపై గతంలో వారణాసి కోర్టు జ్ఞానవాపి మసీదు వీడియో రికార్డింగ్‌కు ఆదేశాలు ఇచ్చింది. అసలు జ్ఞానవాపి మసీదులో హిందు నిర్మాణాలకు సంబంధించి ఏమైనా ఆదారాలు ఉన్నాయా? అనే కోణంలో వీడియోగ్రఫీ సర్వే కొనసాగింది. ఇందులో భాగంగా వాజూఖానాలోని కొలనులో శివలింగం బయటపడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దీంతో జ్ఞానవాపి మసీదు శివాలయం అని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. దీంతో పాటు వెలుపలి గోడలో కొన్ని హిందూ దేవతలకు సంబంధించి ఆధారాలు, త్రిశూలం వంటివి వీడియో సర్వేలో బయటపడ్డాయి. ఇదిలా ఉంటే వాజూ ఖానాలో బయటపడింది శివలింగం కాదని, ఫౌంటెన్ అని ముస్లిం సంఘాలు వాదిస్తున్నాయి.