News

ప్రవక్తపై వ్యాఖ్యలు భారత్ ఆంతరంగిక వ్యవహారమన్న బంగ్లా మంత్రి

460views

ఢాకా: మహమ్మద్ ప్రవక్తను అవమానించేటట్టు వ్యాఖ్యలు చేశారని చెలరేగిన వివాదం భారతదేశ అంతర్గత విషయమని, ఢాకాలోని ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ సమాచార, ప్రసార మంత్రి డాక్టర్ హసన్ మహమూద్ స్పష్టం చేశారు.

“మొదట, ఇది బాహ్య సమస్య (బంగ్లాదేశ్‌కు సంబంధించి). ఇది భారతదేశ సమస్య, బంగ్లాదేశ్‌కు సంబంధించినది కాదు. మేము ఏమీ చెప్పనవసరం లేదు”, అని మహమూద్ ఢాకాలో సందర్శిస్తున్న భారతీయ జర్నలిస్టుల బృందంతో అనధికారిక ఇంటరాక్షన్‌లో పేర్కొన్నారు.

ఈ విషయంలో తగు చర్య తీసుకున్నందుకు భారత అధికారులను మహమూద్ అభినందించారు. ఈ సమస్యను మరింత “రాజేయ” వద్దని ఆయన అందరికి సూచించారు.

బీజేపీకి చెందిన ఇద్దరు మాజీ అధికార ప్రతినిధులు ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా డజనుకు పైగా ముస్లిం దేశాలు , 57 దేశాల ఇస్లామిక్ కోఆపరేషన్ (ఒఇసి) నిరసన లేదా ఖండన ప్రకటనలు జారీ చేసిన సమయంలో ఢాకా మౌనంగా ఉందే? అని వారు అడిగారు. దేశీయంగా, ఇస్లామిక్ ప్రపంచంలో షేక్ హసీనా ప్రభుత్వం రాజీధోరణి అవ‌లంబించింద‌ని పేర్కొంటూ, మహమూద్ ఇలా అన్నాడు:

“మేము ఏ విధంగానూ రాజీపడము. దైవ ప్రవక్తను అవమానించినప్పుడు, ఎక్కడ జరిగినా మేము దానిని తీవ్రంగా ఖండిస్తాము. కానీ భారత ప్రభుత్వం చర్య తీసుకుంది, దానికి మేము వారికి ధన్యవాదాలు. మేము భారత ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది”.