
-
సెల్‌ఫోన్లు గోవాకు పంపి, కర్ణాటక పయనం
-
దొరికిన ఇన్నోవా కారు
భాగ్యనగరం: హైదరాబాద్‌లోని ఆమ్నేషియా పబ్ సమీపంలో బాలికను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మేజర్లు కాగా.. ముగ్గురు మైనర్లని తేలింది. మరికాసేపట్లోనే నిందితులను కోర్టుకు హాజరుపరిచేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
బాలికపై అత్యాచారం చేసేందుకు నిందితులు వినియోగించిన ఇన్నోవాను పోలీసులు గుర్తించారు. ఘటన తర్వాత వేర్వేరు దారుల మీదుగా కర్ణాటక పారిపోయిన నిందితులు ఇన్నోవాను మాత్రం పోలీసులకు చిక్కకుండా దాచేశారు. పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీల సాయంతో ఇన్నోవా ఆచూకీని కనుగొన్నారు. కారులో క్లూస్ టీంతో ఆధారాలు సేకరించే పనిని పోలీసులు చేపట్టారు.
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఈ కేసు నుంచి తప్పించుకోడానికి ముందే పక్కా ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తోంది. బాలికను ఇన్నోవా కారులో ఎక్కించుకుని దాదాపుగా రెండు గంటల పాటు ఆమెపై కారులోనే గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డ నిందితులు ఆ తర్వాత బాలికను పబ్ వద్దే దింపేసి వెళ్ళినట్టు పోలీసులు తేల్చారు.
బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న నిందితులు గోవాకు వెళుతున్నామని చెప్పి, తమ సెల్ ఫోన్లను గోవాకు పంపారు. నిందితులు మాత్రం కర్ణాటకకు వెళ్ళిపోయారు. హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయే సమయంలో ఐదుగురూ ఐదు మార్గాల్లో పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఇన్నోవా కారును కూడా నిందితులు దాచి పెట్టేశారు. ఈ కారుకు ప్రభుత్వ వాహనం అన్న స్టిక్కర్ మాత్రమే ఉందని.. ఆ కారు ఇంకా టెంపరరీ రిజిస్ట్రేషన్ మీదే ఉందని తెలుస్తోంది.
Source: NationalistHub





