News

మోడీకే మా ఓటు – సర్వేలో వెల్లడించిన జనం

377views

విదేశాల దాడులు, కుట్రలు, కరోనా వేవ్ లు, ఆర్థిక ఇబ్బందులు, అసత్య ప్రచారాలు, దేశద్రోహ మూకల ఆగడాలు ఇలా ఎన్నో సవాళ్లను అధిగమించి దేశాన్ని ఎన్నో రంగాలలో ముందుకు తీసుకు వెళుతున్న ప్రధాని నరేంద్ర మోడీ పైనే ప్రజలు మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. ఆయనకే తమ ఓటని ఢంకా బజాయించి చెబుతున్నారు.

ప్రజలు అవినీతికి ఆస్కారమే లేని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై నమ్మకంగా ఉన్నారు. దేశానికి ఎదురైన, ఎదురవుతున్న సవాళ్ళను ఆయన అధిగమిస్తున్న తీరుకు ప్రజలు ఫిదా అయిపోయారు. అందుకే ఆయన పాలనను 67 శాతం మంది ఆమోదించారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఈ ప్రజామోద రేటింగ్‌ అధికస్థాయికి చేరింది. కొవిడ్ ప్రారంభ సంవత్సరం(2020)లో ఈ రేటింగ్ 62 శాతంగా ఉండగా.. రెండో వేవ్‌ చూపిన ఉద్ధృతికి అది కాస్తా 51 శాతానికి దిగజారింది. ఆ తర్వాత కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడం, మూడోవేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో.. ఇప్పుడా రేటింగ్ 67 శాతానికి పెరిగింది. లోకల్‌ సర్కిల్స్ నిర్వహించిన ఈ సర్వేలో 67 వేల మంది పాల్గొన్నారు.

37 శాతం మంది యువత మోడీ పాలన నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 73 శాతం మంది మోడీ పాలనలో తమ భవిష్యత్తుపై సానుకూలంగా ఉండగా.. 50 శాతం మంది మన దేశంలో వ్యాపారం చేయడం సులభతరంగా మారిందని చెప్పారు. మత సామరస్యాన్ని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం తగిన కృషి చేస్తోందని 60 శాతం అభిప్రాయపడ్డారు.

మోడీ పాలన ప్రపంచానికే ఆదర్శం – అమిత్ షా

తన 8ఏళ్ల పాలనలో ప్రతి భారత పౌరుడి కలలు, ఆశయాలకు ప్రధాని నరేంద్ర మోడీ రెక్కలిచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం అమిత్ షా వరుస ట్వీట్లు చేశారు. అన్ని వర్గాలు విశ్వసించి, గర్వించే నాయకత్వం మోడీ రూపంలో దేశానికి దక్కిందని పేర్కొన్నారు.

గత ఎనిమిదేళ్లలో ప్రతి పౌరుడి కలలు, ఆశయాలకు మోడీ రెక్కలిచ్చారు. వారిలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపారు. సమర్థమైన నాయకత్వం, పట్టుదలతో దేశాన్ని సురక్షితం చేయడమే కాదు.. ప్రతి భారతీయుడు గర్వంతో తలెత్తుకునే నిర్ణయాలను తీసుకున్నారు. టెక్నాలజీ నుంచి సంక్షేమం వరకు మోడీ విధానాలు, ఘనతలు ప్రపంచానికే ఆదర్మం” అని షా కొనియాడారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.