News

ఇస్రో ఉపగ్రహాలు మానవాళికి మహోపకారులు – ఇస్రో అధినేత శ్రీ సోమనాథ్

477views

స్రో ఉపగ్రహాలు మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఆ సాంకేతికత సహాయంతో తుఫాన్, సునామీలను ముందే గుర్తించి హెచ్చరించడంతో పెను ప్రమాదం తప్పుతోందని విద్యార్థులకు ఇస్రో అధినేత శ్రీ సోమనాథ్ తెలిపారు.

“పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక సాంకేతికతను ఇస్రో శాస్త్రవేత్తలు ఏ దేశం నుంచీ దిగుమతి చేసుకోలేదు. సొంతంగా ఇక్కడే తయారు చేశారు. ఈ విషయాన్ని మీకు పూర్తి విశ్వాసంతో చెబుతున్నా.. త్వరలో ఇస్రో మరిన్ని మైలురాళ్లు అధిగమించనుందని” సోమనాథ్ పేర్కొన్నారు. “రాకెట్ ‌కు ఇంథనంలాగా మీకు ఓ లక్ష్యం.. గమ్యం ఉండాలి. కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవాలి. ఇలా విద్యార్థి దశ నుంచే ముందుకెళ్లాలి” అని ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.

తిరుపతి జిల్లా శ్రీ హరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో శనివారం యువికా-2022 విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇస్రో ఉపగ్రహాలు మానవాళికి ఎంతగానో దోహదపడుతున్నాయని.. అంతరిక్ష సాంకేతికతతో పలు ప్రయోజనాలు కలుగుతున్నాయని తెలిపారు. ఇస్రో తుపాన్లు, సునామీలను గుర్తించి ముందస్తు హెచ్చరికలు చేయడంతో పెద్ద ప్రమాదాలు జరగడం లేదన్నారు. యువికా-2022 కార్యక్రమం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులను ఒక చోటకు చేర్చి, వారి మనోభావాలు పంచుకునే అవకాశమిచ్చామని వివరించారు. యువికా 2022 కార్యక్రమానికి ఎంపికైన.. 153 మంది 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో ఇస్రో ఛైర్మన్ ముఖాముఖిలో పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు తమ ఆసక్తిని సోమనాథ్ కు వివరించారు. ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని సోమనాథ్ ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు ధ్రువపత్రాలు ప్రదానం చేశారు. షార్‌ సంచాలకులు రాజరాజన్, సీనియర్‌ శాస్త్రవేత్త అలెక్స్, సీబీపీవో సుధీర్ ‌కుమార్, డీడీ సెంథిల్ ‌కుమార్, ఎంఎస్‌జీ గ్రూపు డైరెక్టర్‌ గోపీకృష్ణలు పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఇస్రో అధిపతి సోమనాథ్ ఓపికగా‌ సమాధానమిచ్చారు. వారి అనుమానాలు నివృత్తి చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.