
విజయవాడ: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని సమగ్రంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ఢిల్లీకి చెందిన సంస్థతో మాస్టర్‌ప్లాన్ రూపకల్పన చేయిస్తున్నట్టు దేవాదాయశాఖ కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే కొన్ని ఏజెన్సీలు మాస్టర్‌ప్లాన్ రూపొందించినా.. అవి సంతృప్తికరంగా లేవని అన్నారు. అందుకే ఢిల్లీకి చెందిన సీబీఆర్ఐ ఏజెన్సీకి బాధ్యతను అప్పగించామన్నారు.
వచ్చే 30 ఏళ్లలో ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని అంచనా వేస్తూ.. ప్రస్తుతం వస్తోన్న భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదిగా సమకూర్చేందుకు ఈ ఫ్లాన్ తయారు చేయిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలకు మాస్టర్‌ప్లాన్ రూపకల్పన చేయించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని… అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టుగా ఇంద్రకీలాద్రిని ఎంపిక చేసినట్టు తెలిపారు. కేవలం 18 ఎకరాల పరిమిత విస్తీర్ణంలోనే ఇంద్రకీలాద్రి ఉందని… తక్కువ విస్తీర్ణంలోని ప్రదేశాన్ని మెరుగైన రీతిలో వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కొండ దిగువన ఉన్న గోశాలను వేరే చోటకు తరలించాలని చూస్తున్నామని తెలిపారు.





