వారణాసి: జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను విశ్వహిందూ పరిషత్ చీఫ్ అలోక్ కుమార్ స్వాగతించారు. జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటనే విషయాన్ని హిందువుల తరఫు నుంచి రుజువు చేస్తామని అన్నారు.
”సమస్య సంక్లిష్టమైనందున ఇందుకు అనుభవజ్ఞుడైన న్యాయవాది అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. జిల్లా కోర్టు ఈ వ్యవహారం చూస్తుందని కూడా కోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో మేము ఏకీభవిస్తున్నాం” అని అన్నారు. జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటని తాము నిరూపిస్తున్నామని, నంది చూస్తున్న వైపే ఒరిజినల్ జ్యోతిర్లింగం ఉందని అలోక్ కుమార్ అన్నారు. మొఘల్ దండయాత్రలో ఆలయం అపవిత్రమైందని, శిథిలాలపైనే జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని వాజుఖానా నిర్మించారని అన్నారు.
కోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ ఈ విషయాన్ని తాము నిరూపిస్తామని చెప్పారు. జ్ఞానవాపి మసీదు కేసులో 1991 చట్టం చెల్లుబాటు కాదని అన్నారు. కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రత్యేక చట్టం ఉందని, సుప్రీంకోర్టు సైతం కేసు విచారణకు చట్టం అవరోధం కాదని సూచించినట్టు తెలిపారు.