
కడప: పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాల్లో భాగంగా బ్రహ్మంగారు, గోవిందమాంబల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మఠం పెద్దాచార్యులు భద్రయ్య ఆధ్వర్యంలో రథం ప్రారంభానికి సిద్ధమైంది. ముందుగా రథం నిర్మాణ ఉభయ దాతలకు సన్మానం చేశారు.
అనంతరం దివంగత మఠాధిపతి పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి దంపతులతోపాటు ఆయన తమ్ముళ్లు, రెండో భార్య కుమారులు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు స్థానిక మఠం మేనేజర్ ఈశ్వరాచారితో కలిసి రథం వద్దకు చేరుకోగానే ఆలయ పూజారులు పూజలు చేశారు. అనంతరం గోవింద నామ స్మరణతో భక్తులు రథాన్ని లాగారు.
కిక్కిరిసిన భక్తజనం
వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బ్రహ్మంగారు, గోవిందమాంబలను కళ్లారా చూసి తరించారు. వర్షం వస్తున్నా లెక్క చేయకుండా రథోత్సవాన్ని తిలకించేందుకు గురువారం మధ్యాహ్నం నుంచి వేచి ఉండడమేగాకుండా రథోత్సవం ముగిసేంత వరకు ఉన్నారు.