
-
భారత సైనికులను కిరాతకంగా చంపి, బావిలో పడేసిన ఆంగ్లేయులు
న్యూఢిల్లీ: బ్రిటీష్ పాలనలో 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. బ్రిటిష్ పాలనకు తిరుగుబాటు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అయితే, తాజాగా సిపాయిల తిరుగుబాటులో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు పంజాబ్‌లోని బయటపడ్డాయి.
అమృత్‌సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో సైనికుల అస్థిపంజరాలను కనుకొన్నట్టు పంజాబ్ యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జేఎస్ సెహ్రావత్ తెలిపారు. అజ్నాలాలో మతపరమైన కట్టడం కింద ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలను గుర్తించినట్టు వెల్లడించారు.
కాగా, సిపాయిల తిరుగుబాటులోనే సైనికులు మరణించినట్టుగా ఆ ప్రాంతంలో లభించిన నాణేలు, డీఎన్‌యే అధ్యయనం, ఆంత్రోపోలాజికల్ ఎలిమెంటల్ అనాలిసిస్, రేడియో-కార్బన్ డేటింగ్ వంటి వాటి పరిశీలనల ద్వారా తెలుస్తున్నదని ఆయన తెలిపారు. అయితే, బ్రిటిష్ కాలంలో భారత సైనికులు.. తూటాలను పంది మాంసం, గొడ్డు మాంసంతో తయారుచేశారన్న కారణంగా తిరుగుబాటు మొదలైంది. దీంతో బ్రిటిష్ అధికారులకు ఎదురుతిరిగిన భారత సైనికులను కిరాతకంగా చంపారు. అనంతరం వారి మృతదేహాలను ఓ బావిలో పడేశారు.