
తిరుపతి: తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి దంపతులు సారె సమర్పించారు. ఈ నెల 10వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర 18వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. తుడ సర్కిల్ నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి సారెను తీసుకెళ్లారు. అనంతరం ఈవో దంపతులు ఆలయ ప్రదక్షిణగా వెళ్ళి గర్భాలయంలో అమ్మవారికి శేషవస్త్రాలు, పసుపుకుంకుమతో కూడిన సారెను సమర్పించారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోదరి అని ప్రతీతి అన్నారు.
శ్రీ అనంతాళ్వార్ ఇక్కడ గంగమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించినట్టు తెలుస్తోందన్నారు. పూర్వం భక్తులు ముందుగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని ఆ తరువాత తిరుమలకు వెళ్ళేవారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి టీటీడీ తరపున సహాయ సహకారాలు అందిస్తామన్నారు.