News

నేరాలను అంగీకరించిన వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్

388views

2017లో జమ్మూ కాశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించిన తీవ్ర‌వాదం, వేర్పాటువాదం కార్యకలాపాలకు సంబంధించిన కేసులో తాను ఎదుర్కొంటున్న అభియోగాలను వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ అంగీకరించారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఎదుర్కొంటున్న అభియోగాలను సైతం ఢిల్లీలో ఒక న్యాయస్థానం ఎదుట ఆయన అంగీకరించారు.

కోర్టు వర్గాల ప్రకారం UAPA సెక్షన్లు 16 (టెర్రరిస్టు చర్య), 17 (టెర్రరిస్టు కార్యకలాపాల కోసం నిధుల సేకరణ), 18 (టెర్రరిస్టుల కార్యకలాపాలకు పాల్పడటానికి కుట్ర), 20 (టెర్రరిస్టు ముఠా, టెర్రరిస్టు సంస్థలో సభ్యుడు), భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 120-B (నేరపూరితమైన కుట్ర), 124-A (దేశద్రోహం) కింద తాను ఎదుర్కొంటున్న అభియోగాలను సైతం మాలిక్ తోసిపుచ్చలేదు.

మాలిక్ ఎదుర్కొంటున్న అభియోగాలకు సంబంధించి అతడికి విధించాల్సిన శిక్షపై వాదోపవాదాలను ప్రత్యేక జడ్జి ప్రవీణ్ సింగ్ మే 19న వింటారు. అభియోగాలకు లోబడి మాలిక్‌కు గరిష్టంగా జీవిత ఖైదు శిక్ష విధించే అవకాశం ఉందని కోర్టు వర్గాలు వెల్లడించాయి.

పుల్వామా దాడి అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో భారత్ వ్యతిరేక, వేర్పాటువాద శక్తుల ఏరివేతతో 2019 నుంచి మాలిక్ జైలులో ఉన్నారు. అనంతరం జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (NIA) కస్టడీలోకి వచ్చారు. అటు పిమ్మట మాలిక్‌ను జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు నుంచి ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు.

1989లో మాజీ కేంద్ర హోమ్ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబియా సయీద్ అపహరణ, 1990 సంవత్సరం మొదట్లో ఐదుగురు భారత వైమానిక దళం (IAF) అధికారుల హత్య కేసుల్లో సైతం మాలిక్ నిందితుడుగా ఉన్నారు. యాసిన్ మాలిక్‌పై అనేక కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) టెర్రరిస్టు మఖ్బూల్ భట్‌కు మరణ శిక్ష విధించిన జడ్జి జస్టిస్ నీల్‌కంఠ్ గంజు హత్య, శ్రీనగర్‌లో దూరదర్శన్ కేంద్రం మాజీ డైరెక్టర్ లస్సా కౌల్ హత్య కేసులోనూ మాలిక్ ప్రమేయం ఉంది.

వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కోర్టులో తన నేరాలను అంగీకరించడం పట్ల ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో అర్థ సత్యాలను, ఇస్లామోబియాను చూపారంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను, చిత్రంపై వ్యంగంగా వ్యాఖ్యానించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్‌ను, నెయిల్ ఫైల్స్ తీస్తానంటూ ట్వీట్ చేసిన హిందీ సినీ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నాను ఆయన నిలదీశారు. నేరాలకు పాల్పడ్డానని యాసిన్ మాలిక్ అంగీకరించిన తర్వాత కూడా అలాగే వ్యవహరిస్తారా? అని వారిని వివేక్ అగ్నిహోత్రి ప్రశ్నించారు.

VSK TELANGANA సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.