News

పాక్‌లోని ఆ మహిళా వర్శిటీలో ఫోన్లు నిషేధం!

612views

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని ఓ మహిళా విశ్వవిద్యాలయ యాజమాన్యం వర్సిటీ క్యాంపస్‌లో ఫోన్లను నిషేధించింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. అయిదు వేల జరిమానాను విధిస్తామని హెచ్చరించింది. ఈ వివరాలను సామా టివి ఛానల్‌ ఓ కథనంలో వెల్లడించింది.

తెహ్రిక్‌ తాలిబన్‌ మిలిటెంట్లు క్రియాశీలంగా ఉండే ఖైబర్‌ పఖ్తుంక్వా ప్రాంతంలోని ఉమెన్‌ యూనివర్సిటీ స్వాబి యాజమాన్యం కఠిన ఆంక్షలు విధించింది. క్యాంపస్‌ పరిసరాల్లోకి స్మార్ట్‌ఫోన్లు, టచ్‌స్క్రీన్‌ మొబైల్‌ ఫోన్లు లేదా ట్యాబ్‌లను అనుమతించబోమని విశ్వవిద్యాలయ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ ఆదేశాలు ఏప్రిల్‌ 20 నుంచే (బుధవారం) అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు.

యూనివర్సిటీలో ఉన్న సమయంలో విద్యార్థినులు సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నట్టు గమనించి ఈ ఆదేశాలను జారీ చేసినట్టు విశ్వవిద్యాలయ అధికారులు నోటిఫికేషన్‌లో తెలిపారు.

ఖైబర్‌ పఖ్తుంక్వా ప్రాంతంలో విద్యార్థినుల డ్రెస్‌ కోడ్‌, హెయిర్‌ స్టైల్‌ వంటి వాటిపై తరచూ కఠిన ఆంక్షలు అమలుచేస్తుంటారు. అమ్మాయిలంతా సల్వార్‌ కమీజ్‌ ధరించాలని నిబంధనలు పెడుతుంటారు. గతేడాది మార్చిలో పెషావర్‌ యూనివర్సిటీ కొత్త డ్రెస్‌ కోడ్‌ను పాటించాలని ఆదేశించింది.

తమకు నచ్చిన కమీజ్‌తో పాటు తెల్లని సల్వార్‌ ధరించాలని షరతు పెట్టింది. పురుషులైతే మంచిగా కనబడేలా దుస్తులు ధరించాలని సూచించింది. అలాగే, గతేడాది జనవరిలో హజారా వర్సిటీ యాజమాన్యమైతే విద్యార్థినులు దుపట్టాతో పాటు సల్వార్‌ కమీజ్‌ ధరించాలని ఆదేశించింది. కొత్త రూల్స్‌ పేరిట భారీగా మేకప్‌, నగలు పెట్టుకోవడం, ఖరీదైన హ్యాండ్‌ బ్యాగ్‌లను నిషేధించిందని ఆ టీవీ ఛానల్‌ పేర్కొంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి