
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న హింసపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఒవైసీ ట్వీట్ లో “అమిత్ షా హోంమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీలో అల్లర్లు సాధారణమైపోయాయని విమర్శించారు. పిస్టళ్లు పట్టుకుని అల్లర్లలో కనిపించే వారి సంఖ్య ఎక్కువవుతోందని, వీరిపై ఆయుధాల చట్టం వర్తింపజేయరా?” అని ప్రశ్నించారు.
“మీ పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. వారందరూ ముస్లింలే” అని ఆరోపించారు. ఆయుధాలు ధరించి విచ్చలవిడిగా సంచరిస్తూ మసీదులను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించడం నేరం కాదా? అని మండిపడ్డారు. దేశ రాజధానిలో ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఒవైసీ నిలదీశారు. ఊరేగింపులో తుపాకులు ధరించి నడిచినవారి పేర్లను ఢిల్లీ సీఎం ఎందుకు వెల్లడించలేకపోతున్నారని ప్రశ్నించారు. మసీదులపై దాడులకు పాల్పడిన ఘటనలను ఇంతవరకు ఖండించలేదని ప్రశ్నించారు.
ఫిబ్రవరి 2020 అల్లర్ల తర్వాత ఢిల్లీలో జరిగిన మొదటి మతపరమైన ఘర్షణలో భాగంగా ఏప్రిల్ 16 న నగరంలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా రాళ్ళదాడి చోటు చేసుకుంది. ఈ ఘర్షణల కారణంగా ఎనిమిది మంది పోలీసు సిబ్బంది, ఒక పౌరుడు గాయపడ్డారు.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





