News

పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ – ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదన

564views

* అధ్యక్షుడి ఆమోదం

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఆ దేశ సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ పేరును ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించాడు. పాకిస్థాన్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ జరగడానికి ముందే ఇమ్రాన్ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రతిపాదించాడు. దానికి అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ అంగీకారం తెలపడంతో నేషనల్ అసెంబ్లీ రద్దయింది.

‘అవిశ్వాసం’ ఆటలో ఆఖరి బంతి వరకూ పోరాడతానంటూ ఇన్నాళ్లూ చెప్పుకొంటూ వచ్చిన ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌.. అందుకు తగ్గట్టే ప్రతిపక్షాలకు షాకిచ్చారు. ఇమ్రాన్ ‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జాతీయ అసెంబ్లీలో ఆదివారం చర్చ జరగాల్సి ఉంది. అయితే రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించారు. ఆ వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ దేశాధ్యక్షుడికి ఇమ్రాన్‌ సిఫార్సు చేయడం, దానికి అధ్యక్షుడు ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. డిప్యూటీ స్పీకర్‌ నిర్ణయం, ప్రధాని సిఫార్సుకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశాయి. తాజా పరిణామాలపై అప్పటికే సుమోటోగా విచారణ ప్రారంభించిన సర్వోన్నత న్యాయస్థానం.. జాతీయ అసెంబ్లీ రద్దుకు సంబంధించి అధ్యక్షుడు, ప్రధానమంత్రి చేపట్టిన చర్యలు కోర్టు పరిధిలోకి వస్తాయని పేర్కొంది. పాక్ ‌లో ఇప్పటివరకు ఒక్క ప్రధాని కూడా ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేసుకోకపోవడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.