
బెంగళూరు: కర్ణాటక పాఠ్యపుస్తకాల్లో టిప్పు సుల్తాన్ చరిత్రను పొగుడుతూ ఉన్న అనవసర అంశాల్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టిప్పు సుల్తాన్ చరిత్రపై పాఠ్య పుస్తకాల్లో పొందుపర్చిన అంశాలపై సమీక్ష జరిపేందుకు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం స్కూల్ టెక్స్ట్ బుక్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ అంశంపై పరిశీలించిన కమిటీ… టిప్పు సుల్తాన్ చరిత్రను కీర్తిస్తూ ఉన్న అంశాల్ని తొలగించాలని సూచించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. పాఠ్య పుస్తకాల్లో టిప్పు సుల్తాన్ చరిత్ర అలాగే ఉంటుందని, అయితే, అతిగా పొగుడుతూ ఉన్న అంశాల్ని మాత్రమే తొలగిస్తామని చెప్పింది.
కొంతకాలంగా టిప్పుసుల్తాన్ చరిత్రపై బీజేపీ, ఇతర పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. గత జనవరిలో మహారాష్ట్రలో టిప్పుసుల్తాన్ పేరుతో రూపొందిన ఒక మైదానం ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ, వీహెచ్‌పీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య వివాదం తలెత్తింది. మైదానానికి టిప్పు సుల్తాన్ పేరు తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది.