
సుమీ: ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన 694 మంది భారత విద్యార్థుల్ని తరలించినట్టు మంగళవారం కేంద్రం వెల్లడించింది. దీనితో యుద్ధం మధ్యలో చిక్కుకున్న భారతీయుల తరలింపులో చివరి గండం గడిచినట్టయింది. సుమీలో చిక్కుకుపోయినవారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమైందని, ఇందులో భాగంగానే వారిని బస్సుల్లో పోల్తావాకు తరలిస్తున్నట్టు కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ వెల్లడించారు.
అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు రానున్నట్టు సమాచారం. ‘నిన్న రాత్రి కంట్రోల్ రూమ్‌తో మాట్లాడా. 694 మంది భారతీయ విద్యార్థులు సుమీలో ఉన్నారు. ఈ రోజు వారందరూ పోల్తావాకు బయలుదేరారు’ అని మీడియాకు తెలిపారు. సుమీ యూనివర్శిటీకి చెందిన ఒక విద్యార్థి కూడా ఈ వార్తను ధ్రువీకరించారు. తమ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సలు వచ్చాయని.. తామంతా పోల్తావాకు చేరుకోనున్నామని తెలిపారు.
తమ విజ్ఞప్తిని మన్నించిన రష్యా మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేసిందని, దీంతో సుమీలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా తరలిస్తున్నట్టు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ట్వీట్ చేశారు. తీవ్రమైన చలిలో ఆహారం, నీరు తక్కువగా ఉన్నప్పటికీ, తాము 50 కి.మీ ప్రయాణించి రష్యా సరిహద్దుకు చేరుకునేందుకు యత్నిస్తున్నామని కొందరు విద్యార్థులు పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Source: Nijamtoday





