News

ఉక్రెయిన్‌లోని భారతీయులను క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రణాళిక

482views
  • విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా భరోసా ఇచ్చారు. ఇందుకోసం ఉక్రెయిన్‌ సమీపంలో ఉన్న పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల సహకారం తీసుకోనున్నట్టు తెలిపారు.

రష్యన్‌ భాష మాట్లాడే అధికారులను ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు, అక్కడి ఇరుగుపొరుగు దేశాలకు పంపిస్తున్నామని చెప్పారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను పొరుగు దేశాలకు, అక్కడి నుంచి మన దేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఇందుకోసం ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.

సహాయక కేంద్రాలు నెలకొల్పుతున్నామని చెబుతూ ఉక్రెయిన్‌లోని మన దేశస్తులను భద్రంగా తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారని హర్షవర్దన్‌ వెల్లడించారు. భారత వైమానికి దళం విమానాలతోపాటు వాణిజ్య విమానాలను వాడతామని తెలిపారు. ఉక్రెయిన్‌తోపాటు పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.

భారత విద్యార్థులతో సహా ఉక్రెయిన్‌లో మొత్తం 20 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వీరిలో నాలుగు వేల మంది తిరిగి వచ్చేశారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి భారతీయ విద్యార్థులు గురువారం పోటెత్తారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే, వారి కోసం భారత ఎంబసీ రక్షణపరమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఎంబసీ కల్పించిన వసతి సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నాయి. ఇప్పటిదాకా 200 మందికి పూర్తి భద్రతతో కూడిన తగిన వసతి కల్పించినట్టు సమాచారం. ఉక్రెయిన్‌లో విధించిన మార్షల్‌ లాతో రాకపోకలు కష్టతరంగా మారాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

సైరన్లు, బాంబు హెచ్చరికలు వినిపించే వారు తమ సమీపంలోని బాంబు షెల్టర్లకు చేరుకోవాలని భారతీయులకు సూచించింది. ‘ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారు గూగుల్‌ మ్యాప్‌ల సాయంతో సమీపంలోని బాంబు షెల్టర్లను గుర్తించండి. చాలా వరకు బాంబు షెల్టర్లు భూగర్భ మెట్రోల్లోనే ఉన్నాయి. చుట్టుపక్కల చోటుచేసుకునే పరిణామాల పట్ల అప్రమత్తతతో మెలగాలి. అన్ని సమయాల్లోనూ గుర్తింపు పత్రాలు వెంట ఉంచుకోవాలి’అని పేర్కొంది.

మరోవైపు, ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులందరినీ కాపాడేయత్నం చేస్తున్నామని భారత్‌లో ఆ దేశ రాయబారి ఇగోర్‌ పోలిఖ తెలిపారు. భారత్‌ ప్రకటనలు సరిపోవని, శాంతిని నెలకొల్పే యత్నం చేయాలని ఇగోర్‌ పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి