News

చదువుకొనే విద్యార్థినులకు ముస్లిం వస్త్రధారణతో పనేంటి?

525views
  • హిజాబ్ ధరించిన ముస్లిం యువతులకు అనుమతి నిరాకరించిన విద్యా సంస్థ

ఉడుపి: హిజాబ్ ధరించారన్న కారణంతో విద్యార్థినులను అనుమతించేందుకు ఓ కాలేజీ నిరాకరించింది. చదువుకునే విద్యార్థినులకు ముస్లిం వస్త్రధారణతో పనేంటి అని ప్రశ్నించింది. కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపూర్ ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ గాళ్స్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. కుందాపూర్ బీజేపీ ఎమ్మెల్యే హాలాడి శ్రీనివాస్ శెట్టి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి 25 మంది హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు.

ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలకు వస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ వీరు ఇలా కాషాయ కండువాలు ధరించారు. కాగా, హిజాబ్‌ను నిషేధించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గురువారం ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలకు రాగా ప్రిన్సిపల్, ఇతర అధికారులు వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. నుదట ధరించిన ఇస్లామిక్ హెడ్ స్కార్ఫ్‌ను తొలగిస్తేనే తరగతి గదుల్లోకి అనుమతిస్తామని చెప్పారు.

ప్రభుత్వ అధికారిగా.. డిపార్ట్‌మెంట్ ఆదేశాలను తాను అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే శెట్టి నేతృత్వంలోని కాలేజ్ డెవలప్‌మెంట్ మానిటరింగ్ కమిటీ హిజాబ్‌ను నిషేధించాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉంది. దీనిపై విద్యార్థినులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. వచ్చేవారం దీనిపై విచారణ జరగనుంది. కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ మాట్లాడుతూ.. విద్యా సంస్థలు రెండు సామాజిక వర్గాల యుద్ధానికి వేదిక కాకూడదని అన్నారు. అదో పవిత్ర స్థలమని, అక్కడ అందరూ సమానమేనని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి