
కైమూర్: బీహార్‌లోని కైమూర్‌లో ఒక క్రూరమైన ఘటన చోటు చేసుకుంది. కొంతమంది దొంగలు రాత్రి సమయంలో కాళీ మాత దేవాలయాన్ని దోచుకోవడానికి ముందు ఏడు కుక్కలను చంపారు. ఈ సంఘటన ఈనెల 28వ తేదీ అర్థరాత్రి సమయంలో చోటు చేసుకుంది. ఆలయంలో ఎవరూ లేని సమయంలో ఇది జరిగింది. ఆలయంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా దొంగతనానికి పాల్పడడానికి ప్రయత్నించిన దొంగలు ఈ ఆలయానికి సమీపంలో ఉన్న ఏడు కుక్కలకు విషం పెట్టారు.
కుక్కలను చంపిన తరువాత, దొంగలు ఆలయ తలుపులను పగులగొట్టారు. ఆలయంలో ఉంచిన విరాళాల పెట్టెను దొంగలు పగులగొట్టి అందులోని పదిహేను వేల రూపాయలకు పైగా నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం పూజారి ఆలయానికి వచ్చి చూడగా దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్నారు. భూబువా రోడ్డులోని జీఆర్పీ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. జీఆర్పీ, మోహనియా పోలీస్‌స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో మరిన్ని వివరాలను వెల్లడిస్తామని జీఆర్పీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ జయప్రకాష్ తెలిపారు.
ఆలయ ట్రస్ట్ కార్యదర్శి ధీరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ “దొంగలు గుడి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. వారు హుండీలోని సుమారు 15 వేల నుంచి 20 వేల నగదును ఎత్తుకెళ్లారు. సమీపంలో నివసించే ఏడు అమాయక జంతువులకు విషమిచ్చి చంపేశారు. ఈ కుక్కలు క్రమం తప్పకుండా ఆలయాన్ని సందర్శిస్తాయి. వాటికి కూడా ప్రసాదం పెట్టేవాళ్ళు ఆలయ పూజారులు. దొంగలు వాటిని చంపేశారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని స్థానిక అధికారులు, పోలీసులను నేను కోరుతున్నాను” అని తెలిపారు.
Source: NationalistHub