
విశాఖ జిల్లా,పాడేరు గిరిజన డివిజన్ నుండి 10 బస్సులలో 485 మంది గిరిజన మహిళలు, పురుషులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం స్వామి వారి దేవాలయం ముందు తమ భావాలను ఇలా తెలియ చేశారు.. …
“తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన 10 బస్సులలో పాడేరు గిరిజన ప్రాంతాల నుండి మేము తిరుమల వచ్చి స్వామి వారిని కళ్ళారా చూశాం. మేము ఇక్కడకు రావడం ఇదే మొదటి సారి. ఈ దర్శనభాగ్యం కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు, SSF వారికి మా ధన్యవాదాలు.
గతంలో మా పాడేరు గిరిజన డివిజన్ లో టి.టి.డి.ఆర్థిక సహాయంతో, SSF వారి హార్థిక సహకారంతో మేము కోరుకున్న విధంగా 35 దేవాలయాలను ఎంతో కష్టపడి నిర్మించుకున్నాం. ప్రస్తుతం ఈ దేవాలయాల్లో మా గిరిజన సోదరులే చక్కగా పూజారులుగా పని చేస్తున్నారు. ఈ పూజారులకు టి.టి.డి వారే తర్ఫీదు ఇచ్చారు. ఈ కార్యక్రమాల వల్ల మా గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడి తగ్గింది.
మేము అనాదిగా ప్రకృతినే తల్లిగా పూజిస్తున్నాం…..
మోదు కొండమ్మ తల్లి మా దేవత. భూమి, చెట్టు, పుట్ట, నీరు, గుట్ట, వనదేవత… మా దేవతలు. ఇతర మతాల వారు ప్రకృతిని దోచుకుంటున్నారు.
సనాతన హిందూ ధర్మంలో మాత్రమే ప్రకృతిని తల్లిగా కొలుస్తారు, ప్రకృతిని కాపాడు కుంటారు. మా గిరిజన దేవతలు అందరూ ఆ దుర్గమ్మ అవతారాలే! మేము పాండవులను కొలుస్తాము.మా చింతపల్లి మండలంలో లంబసింగి గ్రామంలో సంతపేట వీధిలో ప్రాచీన కృష్ణ మందిరం ఉంది. ఈ దేవాలయంలో 100 మంది కౌరవుల విగ్రహాలు, 5 గురు పాండవుల విగ్రహాలు ఉన్నాయి. నేడు అవి శిధిల స్థితిలో ఉన్నాయి.
“పాండవుల అజ్ఞాతవాసం ఇంకా పూర్తి కాలేదు. కౌరవుల దుష్ట రాజ్యం ఇంకా కొనసాగుతోంది. త్వరలో పాండవుల అజ్ఞాత వాసం పూర్తవుతుంది. పాండవుల ధర్మ రాజ్యం వస్తుంది.” అని మేము పాటలు పాడుకుంటాము. మాది పాడేరు డివిజన్. మేము గిరిజనులం మేం హిందువులం అని పేర్కొన్నారు.
నారసింహుడు మా ఇంటి అల్లుడు
శ్రీశైలం మల్లన్నను మొదట సేవించింది, దేవాలయాన్ని అన్ని విధాలా బాగోగులు చూసిందీ, భక్తులకు అటవీ ప్రాంతంలో దారి చూపించింది మా చెంచు సోదరులే! అహోబిలంలో ఉగ్ర నారసింహుడు మా ఇంటి ఆడపడుచు చెంచులక్ష్మిని వివాహమాడాడు. నార సింహుడు మా ఇంటి అల్లుడు.
తిరుమల వెంకన్నస్వామి మా లంబాడీ భక్తుడు హాథీరాం బాబాజీతో స్వయంగా పాచికలు ఆడాడు. మేం హిందూ ధర్మంతో ముడివడిన వారం, మమ్ములను హిందువులం కాదంటూ వేరు చేయడం తగదు. క్రైస్తవ మతం తీసుకున్న మా గిరిజన సోదరులు కొందరు మా గిరిజన పండుగలను చేయడం లేదు. మా గిరిజన పండుగలను చేయని వారు, గిరిజన సంస్కృతికి దూరంగా జరిగిన వారు గిరిజనులెట్లా అవుతారు?” అని వారు అడిగారు.
-
పై ఫోటోలో ఉన్నది ఒక బస్సులో వచ్చిన చింతపల్లి మండలానికి చెందిన వివిధ గ్రామాల, వివిధ గిరిజన తెగల వారు.





