NewsProgramms

మూడవ ఘాట్ నిర్మాణంపై పునరాలోచించండి – తితిదే కు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి విజ్ఞప్తి

138views

తిరుమల తిరుపతి సంరక్షణ సమితి (టి.టి.ఎస్.ఎస్) కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీ హరికృష్ణ అధ్యక్షతన తే. 19.01.2022 .ది బుధవారం ఉదయం 10.00 గం॥ లకు జిల్లా కమిటీ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్రీ కె.శ్యాంప్రసాద్ పాల్గొని మార్గదర్శనం చేశారు. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలను చర్చించి ఆమోదించారు. ఆ తీర్మానాల వివరాలను యదాతథంగా చదివి తెలుసుకుందాం.

తీర్మానాలు :

1. అన్నమయ్య మార్గాన్ని విస్తరించే ఆలోచనను దేవస్థానం పునరాలోచించాలి.

“తిరుపతి నుండి తిరుమలవైపు వెళ్లే రెండవ ఘాటు మార్గంలో వర్షాకాలంలో బండరాళ్లు పదే పదే పడుతున్నవి. ఈ నేపధ్యంలో కడప వైపు నుండి అన్నమయ్య కాలిబాటలో బస్సుల కోసం నూతనంగా రోడ్డు నిర్మాణం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నిర్ణయాన్ని టి.టి.డి వారు పునరాలోచించాలని టి.టి.ఎస్.ఎస్ విజ్ఞప్తి చేస్తున్నది. అన్నమయ్య మార్గంలో అనేక అటవీ జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నవి. నూతన రోడ్డు నిర్మాణం వల్ల అటవీ జంతువుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. రోడ్డును విస్తరిస్తూ బస్సులు తిరగడానికి విస్తరిస్తూ చేయడం వల్ల వేలాది చెట్లు నరికి వేయవలసి వస్తుంది. అదేమార్గంలో వున్న అనేక పుణ్యక్షేత్రాలు కలుషితమవుతాయి. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ నియమాలు వున్నప్పటికీ తిరుమల అటవీ ప్రాంతము నుండి ఎర్ర చందనం చెట్లు నరికివేత నిరాటంకంగా కొనసాగుతున్నది. ఈ రోడ్డు వేయడం వల్ల భవిష్యత్తులో అనేక దుకాణాలకు, భవనాలకు అనుమతి ఇవ్వవలసి వస్తుంది. ఈ ప్రాంతములో అడవి కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. ప్రకృతిపరమైన ఈ నష్టాలను దృష్టిలో పెట్టుకొని అన్నమయ్య కాలిమార్గంలో కేవలం నడచి వచ్చే నియమాలను మాత్రమే రూపొందించాలని టి.టి.ఎస్.ఎస్.కోరుతున్నది. ఇప్పటికే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కళ్ళుగప్పి అక్రమంగా అనేక వస్తువులు కొండమీదకు చేరుతున్నవి. అన్నమయ్య మార్గంలో అనుమతించినప్పటికీ కొండ మీద నిషేధిత వస్తువులు రాకుండా కఠిన చర్యలు తీసుకోవలసి వున్నది. చంద్రగిరి వైపు నుండి అనేక సంవత్సరములుగా వున్న నడక మార్గము వద్ద రోడ్డు మార్గ నిర్మాణ అవకాశాలను నిపుణులతో చర్చించి నిర్ణయించవలసినదిగా టి.టి.డికి టి.టి.ఎస్.ఎస్. సలహా ఇస్తున్నది.

2. రాష్ట్ర వ్యాప్తంగా పేద ఎస్సీ/ఎస్టీ భక్తులకు స్వామివారి దర్శనాన్ని టి.టి.డి. ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వార దర్శనాలను టి.టి.ఎస్.ఎస్. స్వాగతిస్తున్నది.

జనవరి 13 నుండి 22 వరకు 10 రోజులపాటు రోజుకు సుమారు 1000 మందికి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం ఇప్పించడమనే మంచి అవకాశాన్ని టి.టి.డి. కల్పించింది. రాష్ట్రంలో టి.టి.డి. ఆర్థిక సహకారంతో 502 చోట్ల నిర్మించిన దేవాలయాలున్న ఎస్సీ/ఎస్టీ మత్స్యకార గ్రామాల పరిధిలోని భక్తులకు మాత్రమే ఈ దర్శన సౌకర్యం ఏర్పాటు చేసినారు. తరతరాలుగా హిందూ సమాజము చేత నిర్లక్ష్యానికి గురైన ఈ ఎస్సీ/ఎస్టీ భక్తులు ఈ అవకాశాన్ని పొంది ఆనందపరవశులైనారు. వీరందరూ మొట్టమొదటిసారి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ, మతమార్పిడికి అడ్డుకట్ట పడే అవకాశమున్నదని టి.టి.ఎస్.ఎస్. భావిస్తున్నది. ఈ పనిలో విజయవంతంగా పనిచేస్తున్న సమరసతా సేవా ఫౌండేషన్ నాయకులను, కార్యకర్తలను టి.టి.ఎస్.ఎస్. అభినందిస్తున్నది. ఇలాంటి అనేక కార్యక్రమాలను మున్ముందు చేపట్టాలని తిరుమల తిరుపతి సంరక్షణ సమితి టి.టి.డి.కి విజ్ఞప్తి చేస్తున్నది.

ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి సంరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. సుబ్బరామిరెడ్డి, డివిజన్ కార్యదర్శి పాదిరి ధనుంజయ రెడ్డి, కిరణ్ కుమార్ జైన్, ప్రొఫెసర్ సుందరమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.