
-
ఆంధ్రప్రదేశ్‌లో ఘటన
-
ఫిర్యాదు అందినా తహశీల్దార్ నిర్లక్ష్యం
-
రంగంలోకి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్
-
జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
అనంతపురం: ప్రభుత్వ పాఠశాలలో బాలికల మతాన్ని మార్చేందుకు ప్రయత్నం జరిగింది. ఈ ఘటనపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఎల్లనూరు మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో ఈ నెల మూడోతేదీన క్రైస్తవ మత ప్రచార సభను ఏర్పాటు చేశారు. పాఠశాలలోని కొందరు ఉపాధ్యాయుల ద్వారా ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ఒక క్రైస్తవ పాస్టరును ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బాలికలందరినీ పాఠశాల ఆవరణలో మోకాలిపై నిలబెట్టి ప్రార్థనలు చేయించడంతో పాటు వారిపై ఒక రకమైన నూనెను పోయడం అత్యంత వివాదాస్పదమైంది.

ఈ వ్యవహారంపై తొలుత తాడిపత్రికి చెందిన ఏబీవీపీ కార్యకర్తలు యల్లనూరు తహశీల్దార్ కు ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ లేవు. దీంతో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఈ వ్యవహారాన్ని జాతీయ బాలల హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళింది.
బాలికల భద్రతపై ఆందోళన
యల్లనూరు కస్తూరిబా బాలికల పాఠశాల, దానికి అనుబంధంగా నడుస్తున్న బాలికల వసతిగృహంలో బాలికల భద్రతపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఆందోళన వ్యక్తం చేసింది. బాలికల పాఠశాలలోకి ఒక పాస్టరును ఆహ్వానించడం, ఆ పాస్టర్ బాలికల తలపై ప్రార్థన పేరిట ఒకరకమైన నూనె పోయడం తీవ్రమైన విషయాలు అని, ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 28(3) క్రింద ఉల్లంఘనతో పాటు జువైనల్ జస్టిస్ చట్టం, మేజిక్ రెమెడీస్ చట్టాల క్రింద నేరపూరితమైన చర్య అని ఫోరమ్ తమ ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఘటనలో పాలుపంచుకున్న పాస్టర్, అతడిని పాఠశాలకు ఆహ్వానించిన వ్యక్తులపై ఏబీవీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేసినప్పటికీ ఉదాసీనంగా వ్యవహరించిన తహశీల్దార్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫోరమ్ కమిషన్‌ను కోరింది.
Source: Nijamtoday





