
ప్రముఖ కవి, రచయిత, సామాజిక వేత్త, రాజకీయ వేత్త, దేశభక్తుడు, జాతీయవాది పద్మశ్రీ టి వి నారాయణ (వయస్సు 97) ఈ రోజు( జనవరి 11, మంగళవారం) ఉదయం 6.18 నిముషాలకు కేర్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.
స్వర్గీయ శ్రీ టీవి నారాయణ గారు సామాజిక సమరసత వేదిక తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు డా.వంశ తిలక్ గారి తండ్రి గారు.
తన రచనలతో, బోధనలతో, భావాలతో తన జీవితకాలంలోఎందరో వ్యక్తులను ప్రభావితం చేసిన మహనీయుడు డా.టీవీ నారాయణ గారు. రెండు తెలుగు రాష్ట్రాలలో విద్య, సామాజిక రంగాలల్లో సుపరితుడైన వ్వక్తి. తెలంగాణా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. పాఠశాల అద్యాపకుడుగా జీవితం ఆరంభించిన వీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడి స్థాయికి ఎదిగారు. వీరు 1925 వ సంవత్సరంలో జూలై 26 న జన్మించారు. మాజీ మంత్రి సదాలక్ష్మి గారు వీరి సతీమణి. టీవీ నారాయణ సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వారు.
నిజాం కళాశాలలో బి.ఎ. గణిత శాస్త్రము చదివిన వీరు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో ఎం.ఎ. పట్టా పొందారు. వీరు నిత్య విద్యార్థిగా వుంటూ తన 71 వ ఏట కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టాను పొందారు. వీరు అనేక సామజిక కార్యక్రమాల్లో పాల్గొని వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం బంధు సేవామండలి స్థాపించారు. వేదాలు, ఉపనిషత్తులు చదివారు.
పద్మశ్రీ పురస్కారం
భారత రాష్ట్రపతి చేతులమీదుగా వేద పండిత్ పురస్కారాన్ని ఆందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి ధర్మరత్న పురస్కారాలను అందుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి దళిత రత్న పురస్కారాన్ని పొందారు. వీరి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వము వీరిని 2016 లో పద్మశ్రీ పురస్కారముతో గౌరవించింది.
శ్రీ టి వి నారాయణ గారు 20 వరకూ పుస్తకాలు రచించారు. వాటిలో కొన్ని:
జీవనవేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం (కవితా సంపుటి), అమర వాక్సుధా స్రవంతి (ఉపనిషత్తులపై వ్యాస సంపుటి) తను జీవించివున్న కాలంలో సమకాలీన సమాజంపై చెరగిపోని ముద్ర వేసిన పద్మశ్రీ టీవీ నారాయణ గారు చిరస్మరణీయులు.
ప్రముఖుల స్పందన
ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వారిజీవితం సమాసేవలో ధన్యమైన జీవనమని వారికి శతశత నమస్సులు తెలుపుతున్నట్టు శ్రీ వడ్డి విజయసారథి గారు పేర్కొన్నారు.
టి.వి నారాయణ గారు స్వర్గస్థులయ్యారనే వార్త ఎంతో దుఃఖం, బాధను కల్గించిందని ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత కార్యకారిణి సదస్యులు శ్రీ భాగయ్య అన్నారు. టి.వి నారాయణ గారు ఆత్మీయతతో ద్వేశానికి తావు లేకుండా హిందుసమాజ సంఘటనకు, సామాజిక సమతకు అహరహము కృషి చేసిన మహనీయులని పేర్కొన్నారు. వేద పండితులు, ఉత్తమ ఉపాధ్యాయులు, నిజాయితీగా జీవించిన వారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి అండగా నిలిచారని పేర్కొన్నారు. వారి మృతి పట్ల సంతాపం తెలుపుతూ, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తున్నానని శ్రీ భాగయ్య పేర్కొన్నారు.





