News

శ్రీ‌లంక‌లో 55 మంది భారతీయ మత్స్యకారుల అరెస్టు

427views

కొలంబో: శ్రీలంక నావికాదళం మరోమారు భారత మత్స్యకారులపై దాడులకు దిగింది. తమ దేశపు సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ తమిళనాడుకు చెందిన మత్స్యకారులను అరెస్ట్ చేసింది. శనివారం సాయంత్రం తమిళనాడుకు చెందిన 43 మంది మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న 6 పడవలను సైతం స్వాధీనం చేసుకుంది. అనంతరం శ్రీలంక నావికాదళం వారిని కంగెసంతురాయ్ శిబిరానికి తీసుకెళ్లారు. ఈ వివరాలను తమిళనాడు మత్స్యశాఖ అధికారి ఆదివారం ప్రకటించారు.

రామేశ్వరం నుంచి వెళ్లిన 43 మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేసి, 6 ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. దీంతోపాటు శ్రీలంక నావికాదళం మరో 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. తమ దేశ ప్రాదేశిక జలాల్లో వేటాడినట్టు ఆరోపిస్తూ 12 మంది జాలర్లను అదుపులోకి తీసుకోని రెండు ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకుంది. గత రెండు రోజుల్లో శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన భారతీయుల సంఖ్య 55 కి చేరుకుందని సోమవారం అధికారులు ప్రకటించారు.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న తమిళ జాలర్ల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. వారిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేసింది. శ్రీలంక తీరుకు నిరసనగా మత్స్యకార సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అధికారులు చొరవ తీసుకొని మత్స్యకారులను విడిపించాలని వారి కటుంబాలు కోరుతున్నాయి. కాగా.. తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాయి. తమిళనాడుకు చెందిన మత్స్యకారుల విడుదల కోసం శ్రీలంక అధికారులతో వెంటనే మాట్లాడాలని అభ్యర్థించాయి. తమిళనాడుకు చెందిన కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఇప్పటికే భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు ప్రారంభించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి