
న్యూఢిల్లీ: చైనాకు చెందిన బయోటెక్, నిఘా సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. జిన్జియాంగ్ రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అందుకే తాము ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపింది. చైనా మిలిటరీకి సాయం అందించే చైనా అకాడమీ ఆఫ్ మిలిటరీ సైన్సెస్, దాని 11 పరిశోధన సంస్థలు లక్ష్యంగా అమెరికా వాణిజ్య విభాగం ఈ ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది.
ఉయ్ఘర్లను అణచివేసేందుకు జిన్జియాంగ్ రాష్ట్రంలో చైనా ప్రత్యేక నిఘా పెట్టిందని, బయోమెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ ఉపయోగించి 12 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్కుల డీఎన్ఏ సేకరిస్తున్నట్టు తమ నిఘా వర్గాల దృష్టికి వచ్చిందని అమెరికా అధికారిక వర్గాలు తెలిపాయి. అందుకే ఈ ఆంక్షలు విధిస్తున్నట్టు వివరించాయి. జిన్జియాంగ్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు నిరసనగా బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్టు అమెరికా గతవారమే ప్రకటించింది. అయితే తమ ఆటగాళ్లు మాత్రం యథావిధిగా పాల్గొంటారని చెప్పింది.





