తాలిబాన్ల పాలనలో సంక్షోభంలో చిక్కుకున్న ఆఫ్ఘనిస్థాన్ కు భారత్ మానవతా సాయంగా పంపిన వైద్య సామగ్రి మొదటి కన్‌సైన్‌మెంట్ ఆ దేశానికి చేరుకుంది.
ఢిల్లీ నుంచి కాబూల్ వెళ్తున్న ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ కామ్ ఎయిర్‌లో 1.6 మెట్రిక్ టన్నుల వైద్య సామగ్రిని భారత్ ఆఫ్ఘనిస్థాన్ కు పంపింది.
ఆఫ్ఘనిస్థాన్ ఆరోగ్య శాఖ భారత్ అందించిన సాయాన్ని స్వాగతించింది. దేశంలో ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు మరింత సాయం అవసరమని చెప్పింది.
తాలిబాన్లు ఆఫ్ఘనిస్థాన్ ను తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత భారత్ ఆ దేశానికి పంపిన తొలి మానవతా సాయం ఇదే.
“మేం దీనిని ప్రశంసిస్తున్నాం. మిగతా దేశాలు కూడా ఆఫ్ఘనిస్థాన్ కు సాయం అందించేలా ముందుకు రావాలని అపీల్ చేస్తున్నాం” అని ఆఫ్ఘనిస్థాన్ స్థానిక చానల్ టోలో న్యూస్ తో మాట్లాడిన ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావిద్ హజీర్ అన్నారు.
మందులతోపాటూ భారత్ ఆఫ్ఘనిస్థాన్ కు 5 లక్షల కరోనా టీకా డోసులు కూడా పంపించింది.
భారత్ లో ఆఫ్ఘనిస్థాన్ రాయబారి ఫరీద్ మాముంద్‌జయీ ఒక ట్వీట్ ద్వారా భారత్ కు ధన్యవాదాలు తెలిపారు.
తమకు చెడు చేసిన వారికి కూడా మంచి చేసేవారే మహాత్ములు. ఈ సంక్షోభ సమయంలో ఆఫ్ఘనిస్థాన్ లోని చిన్నారులకు వైద్య సహాయం అందించిన భారత్ కు ధన్యవాదాలు. భారత్ – ఆఫ్ఘన్ స్నేహం ఎప్పటికీ నిలిచిపోతుంది” అన్నారు.