News

బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తే సహించం: తేల్చి చెప్పిన హర్యానా సీఎం

583views

గురుగ్రామ్ లో గత కొన్ని వారాలుగా శుక్రవారం బహిరంగంగా నమాజ్ చేస్తూ ఉండడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు, హిందూ సంఘాలు బహిరంగ నమాజ్ లపై తమ వ్యతిరేక గళం వినిపించారు. తాజాగా తమ రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ ‌ను సహించబోమని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ శుక్రవారం స్పష్టం చేశారు. హర్యానాలోని గురుగ్రామ్ ‌లోని వివిధ సెక్టార్లలోని బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడంపై కొనసాగుతున్న ప్రతిష్టంభనపై సీఎం మీడియాతో మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ చేస్తే సహించేది లేదని, రోడ్డు ట్రాఫిక్‌ను అడ్డుకునేలా ప్రార్థనలు ఉండొద్దని సీఎం సూచించారు. 2018లో నమజ్ పై ముస్లిం వర్గాలతో కుదిరిన ఒప్పందాన్ని ఉపసంహరించుకున్నామన్నారు. గుర్గావ్ అధికార వర్గాలతో మళ్లీ చర్చలు జరుపుతున్నామని, ఎవరి హక్కులకూ భంగం కలుగకుండా సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అప్పటి వరకూ, ప్రజలు తమ ఇళ్లలో, ఇతర ప్రార్థనా స్థలాలలో మాత్రమే ప్రార్థనలు చేసుకోవాలని ఆయన అన్నారు.

అన్ని మతాల సభ్యులూ తమ వ్యక్తిగత స్థలంలో లేదా ప్రార్ధనా స్థలాలలో మాత్రమే ప్రార్థనలు చేయాలని ఆయన పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కాకుండా మసీదులు లేదా ఈద్గాలలో నమాజ్ చదవాలి. మతపరమైన ప్రార్థనల నెపంతో నగరంలో బహిరంగ ప్రదేశాల్లోకి చొరబడడాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతించదు. “ఎవరైనా సొంత స్థలాల వద్ద నమాజ్ చేస్తే, దానిలో మాకు ఎటువంటి సమస్య లేదు. బహిరంగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. బహిరంగంగా చేసే ఈ నమాజ్ పద్ధతిని అస్సలు సహించబోము” అని హర్యానా సీఎం అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.