
న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాలనకు జవాబుదారీతనం అత్యంత ప్రధానమైన అంశమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. ప్రజాపద్దుల కమిటీ (పిఎసి) వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పార్లమెంటులోని సెంట్రల్ హాల్‌లో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు.
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంట్ పిఎసి చైర్మన్ అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభల స్పీకర్లు, రాష్ట్రాల పిఎసి చైర్మన్లు హాజరయ్యారు. వందేళ్ల ప్రస్థానానిు ప్రతిబింబిస్తూ రూపొందించిన పిఎసి సెంటెనియల్ సావనీర్‌ను రాష్ట్రపతి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు ప్రజల సంకల్పానికి ప్రతిరూపమని, పార్లమెంటరీ కమిటీలు దాని విస్తరణగా పనిచేస్తాయని పేర్కొన్నారు. నిధుల సేకరణ, ఖర్చు చేయడానికి కార్యనిర్వాహక విభాగానికి అనుమతి ఇచ్చేది పార్లమెంటే కాబట్టి, ఆ నిధులను తదనుగుణంగా ఖర్చు చేశారా? లేదా? అని అంచనా వేయాల్సిన బాధ్యత పార్లమెంటుదేనని ఆయన తెలిపారు.
Source: Nijamtoday





