
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ఎన్నికల తర్వాతే రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా స్పష్టం చేశారు. ఢిల్లీలో ‘హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్’లో ఆయన పాల్గొంటూ రాష్ట్ర హోదాపై మాట్లాడుతున్న వారు కేవలం రాజకీయ వివాదం సృష్టించేందుకే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
తొలుత రాష్ట్ర హోదా పునరుద్ధరించి, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలనే రాజకీయ డిమాండ్ ఉందని, నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినందున తొలుత నియోజకవర్గాల విభజన జరిపి, ఎన్నికలు జరగాల్సి ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాతే రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియ ఉంటుందని తేల్చి చెప్పారు.
ఇదే విషయం తాను చాలాసార్లు చెప్పానని, అయితే కొందరు దీనిని రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అమిత్ షా విమర్శించారు. ఆర్టికల్ 370 ని తిరిగి ప్రవేశపెట్టే వరకు అక్కడ శాంతి నెలకొన్నదని ఫారూఖ్ అబ్దుల్లా ఇటీవల చేసిన ప్రకటనను ఆయన కొట్టిపారవేశారు. ఆర్టికల్ 370 అంతకు ముందు 75 ఏళ్లుగా ఉంటున్నప్పటికీ 1990ల నుండి ఎందుకు అక్కడ శాంతికి భంగం కలుగుతున్నదని ఆయన ప్రశ్నించారు.
Source: Nijamtoday





