News

స్మార్టప్‌ వైపు యువత చూపు

590views
  • కరోనా ముప్పు ఇంకా తొలగలేదు

  • మన్ కీ బాత్‌లో ప్రధాని

న్యూఢిల్లీ: యువత ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశానికి అద్భుతాలు సృష్టించగలిగే సామర్థ్యం ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇప్పుడు ఎవరి నోట విన్నా ‘స్టార్టప్‌’ పదమే వినిపిస్తోందని, ప్రస్తుతం స్టార్ట్‌ప్ శకం నడుస్తోందని మన్ కీ బాత్ లో మోడీ పేర్కొన్నారు. దేశంలో 70కి పైగా స్టార్ట్‌ప్లు రూ.7,500 కోట్ల విలువను దాటాయని తెలిపారు. ఏటేటా ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని, ఈ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. 2015 వరకు దేశంలో తొమ్మిది, పది యూనికార్న్‌లు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో ఉన్నాయన్నారు. దేశంలోని యువత వల్లే కొవిడ్‌ సంక్షోభంలోనూ విజయవంతం అయ్యామన్నారు.

భారతీయ యువత తమ స్టార్ట్‌పల ద్వారా ప్రపంచ సమస్యల పరిష్కారంలోనూ పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బస్సుల ఉద్గారాల వల్ల వచ్చే కాలుష్యాన్ని 40 శాతం తగ్గించేలా తన స్టార్టప్‌ ద్వారా సొల్యూషన్‌ను కనుగొన్న ఓ యువకుడితో ప్రధాని మాట్లాడారు.  ప్రజలకు సేవ చేయాలనే తాను కోరుకుంటానని, ప్రధాని పదవి కూడా అందుకేనని తెలిపారు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులతో ఫోన్‌లో మాట్లాడారు.

ఈ సందర్భంగా.. తమిళనాడులోని తూత్తుక్కుడి జిల్లాకు చెందిన రాజేశ్‌కుమార్‌ అనే లబ్ధిదారుడు మాట్లాడుతూ, ‘మీరు ఎప్పుడూ అధికారంలో ఉండాలి’ అని ఆకాంక్షను వ్యక్తం చేశారు. దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ.. అధికారంలో ఉండాలని తనను ఆశీర్వదించవద్దని, ప్రజాసేవలో ఉండేలా ఆశీర్వదించాలని అన్నారు. కరోనా వైరస్‌ ఇంకా పోలేదని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇక నుంచి మ్యూజిక్ వెబ్‌సైట్‌లోనూ మన్ కీ బాత్

ప్రధాని నరేంద్రమోదీ ప్రతి నెలా నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’ ఇకపై అన్ని ఆడియో, మ్యూజిక్‌ వెబ్‌సైట్లలోనూ అందుబాటులోకి రానుంది. స్పాటిఫై, హంగామా, గానా, జియో సాన్‌, వింక్‌, అమెజాన్‌ మ్యూజిక్‌ వంటి వేదికల్లోనూ ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.  ప్రధాని సందేశాన్ని దేశంలోని యువతకు చేరువ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి