
-
కాలం చెల్లిన బళ్ళును నిర్వీర్యం చేస్తే మరింత ప్రోత్సాహకం
-
దేశంలో తొలి ప్లాంట్ ప్రారంభించిన నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: దేశంలో కాలుష్య నివారణకే జాతీయ వాహన తుక్కు విధానం అమలులోకి తెచ్చినట్టు జాతీయ ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. పాత వాహనాన్ని తుక్కుగా మార్చిన తర్వాత కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేవారికి మరిన్ని పన్ను ప్రోత్సాహకాలు అందించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు.
కాలం తీరిన వాహనాలను (ఈఎల్‌వీలు) తుక్కుగా మార్చి, రీసైక్లింగ్ చేసేందుకు ప్రభుత్వం ఆమోదించిన రీతిలో మారుతీ సుజుకీ టయోత్సు ఇండియా నెలకొల్పిన తొలి ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. టయోటా సుషో గ్రూప్, టయోటా సుషో ఇండియా ప్రై.లి.తో కలిసి 50-50 భాగస్వామ్యంలో మారుతీ సుజుకీ 2019 అక్టోబరు 22న మారుతీ సుజుకీ టయోత్సును ఏర్పాటు చేసింది. కొత్తగా ప్రారంభించిన ప్లాంట్ 10,993 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ ఏటా 24,000 వాహనాలను తుక్కుగా మార్చి రీసైక్లింగ్ చేసే అవకాశం ఉంది.





