News

ఆసిఫాబాద్ జవాను వీర మరణం

706views

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రవీంద్రనగర్-1 గ్రామానికి చెందిన రాజేష్ దాక్వా (40) అనే ఆర్మీ హవల్దార్ జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో సోమవారం రాత్రి వీరమరణం చెందాడు. స్థానిక పోలీసు అధికారులు, కుటుంబీకులు అందించిన సమాచారం ప్రకారం.. రాజేశ్‌దాక్వా 4 ఆర్‌ఆర్ రెజిమెంట్ బీహార్ క్యాడర్‌కు చెందినవాడు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ ప్రాంతంలోని సరిహద్దులో హవల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా సోమవారం రాత్రి 10గంటల సమయంలో గస్తీ నిర్వహిస్తుండగా జరిగిన ఎదురుకాల్పుల్లో రాజేశ్ దాక్వా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. 1997లో ఆర్మీ జవాన్‌గా చేరిన రాకేశ్‌దాక్వా నాలుగేళ్ల క్రితం హవల్దార్‌గా పదోన్నతి పొందారు. పది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లిన జవాన్ ఎదురుకాల్పుల్లో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హవల్దార్ కుటుంబీకుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఆర్మీ జవాన్‌కు తల్లి లతికాతో పాటు భార్య జయ, బిడ్డలు ఖుషి (10), రోషిణి (8) ఉన్నారు. జవాన్ మృతదేహం రెండు రోజుల్లో స్వగ్రామానికి రానున్నట్లు తెలిసింది.

Source: ANDHRA BHOOMI.

http://www.andhrabhoomi.net/content/state-13710