News

నీట మునిగిన చెన్నై!

498views
  • పడవల్లా తేలియాడుతున్న కార్లు..

చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు చెన్నై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. 12 గంటల్లోనే 23 సెంటీమీటర్ల వర్షం పడిరది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై వీధులు నదులను తలపిస్తున్నాయి. చెంబరబాక్కం, పూండి, పుళల్‌ రిజర్వాయర్ల నుంచి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. దీంతో రవాణా స్తంభించిపోయింది. ఉత్తర, దక్షిణ చెన్నై నీటమునిగిపోయాయి. మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. చెన్నై తీర ప్రాంత జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు చెన్నై ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై వరదనీరు చేరింది. దీంతో విమాన రాకపోకలకు అంత‌రాయం ఏర్ప‌డింది. లోకల్‌ ట్రైన్స్‌ రద్దయ్యాయి..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోపాటు ఈశాన్య రుతువవనాలు నిర్ణీత సమయానికి ముందే రాష్ట్రంలోకి ప్రవేశించడంతో చెన్నై నీట మునిగింది. మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వేలాదిమంది నగర వాసులు వరదల్లో చిక్కుకున్నారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో తమిళనాడులో వరద పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈ మేరకు ఆయన ట్విట్‌ చేశారు.

తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, పుదుచ్చేరిలో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై నిలిచిన వరదనీటిని మోటార్లతో తొలగిస్తున్నారు సిబ్బంది. భారీ వర్షాలు, వరదలకు అల్లాడిపోతున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.

ఇక కడలూరు జిల్లాలో వరద విధ్వంసం సృష్టిస్తోంది. శ్రీ ముష్ణం శ్రీ నేదుంచేరి-పావలంగుడి గ్రామాలకు వెళ్లే వంతెనపై నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రమాదకర పరిస్థితుల్లో వంతెన దాటుతున్నారు మహిళలు. 19 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి