News

అక్తర్‌పై రూ.10 కోట్ల నష్ట పరిహారం కేసు

679views
  • పాకిస్తాన్‌ ఛానెల్‌ నోటీసు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌పై రూ.10 కోట్ల నష్ట పరిహారం కేసు ప‌డింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ క్రీడా ఛానల్‌ పీటీఈ(పాకిస్తాన్‌ టెలివిజన్‌ కార్పొరేషన్‌) ఈ దావా వేసింది. అక్తర్‌ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఛానల్‌ను వదిలిపెట్టాడని, నిబంధనలకు విరుద్ధంగా టీ20 ప్రపంచకప్‌ జరుగుతున్న సమయంలో దుబాయిని విడిచిపెట్టి వెళ్లిపోయాడని దీంతో తమ పరువుకు నష్టం వాటిల్లిందంటూ అక్తర్‌కు నోటీసులు జారీ చేసింది. దీనికి అతను తమకు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొంది.

‘మూడు నెలల రాతపూర్వక నోటీసు లేదా అందుకు సమానమైన డబ్బులు చెల్లించి ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు ఇరు పక్షాలకు ఉంటుంది. అయితే, అక్తర్‌ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాజీనామా చేయడంతో మా సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది. పైగా అతను భారత క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌తో కలిసి ఒక ఇండియన్‌ టీవీ షోలో పాల్గొనడం వల్ల మాకు తీరని నష్టం కలిగింది. అందువల్ల అతను పీటీవీ ఛానెల్‌ మూడు నెలల జీతానికి సమానమైన రూ. 33,33,000 పాటు నష్టపరిహారంగా రూ. 10 కోట్లు చెల్లించాల్సిందే. లేకపోతే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని పీటీఈ ప్రతినిధి ఒకరు హెచ్చరించారు. కాగా పీటీఈ ఇటీవల నిర్వహించిన ఓ లైవ్‌షోలో హోస్ట్‌ నౌమన్‌ నియాజ్‌ అక్తర్‌ను బయటకు వెళ్ళిపోవాలని అవమానపరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆ క్షణమే తన మైక్రోఫోన్‌ను విసిరేసి అక్తర్‌ బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఛానెల్‌కు కూడా రాజీనామా చేశాడు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి