News

నిన్న అయ్యప్ప దర్శనానికి యత్నించిన వారు మహిళా మావోయిస్టులా?

624views

నిన్న శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన వారు మహిళా మావోయిస్టులా? అవుననే అంటున్నారు శబరిమల కర్మ సంస్థ వారు. ప్రస్తుతం స్వామిని దర్శించుకోడానికి వచ్చిన తమిళనాడు బృందంలోని మహిళలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని శబరిమల కర్మ సంస్థ ఆరోపించింది. వీరిలో చాలా మంది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ విషయం తెలిసినా పోలీస్ అధికారులు రక్షణ కల్పించడమేంటని మండిపడింది.

వివరాల్ల్లోకి వెళితే నిషేధిత వయసు మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకోవాలనే మహిళలను భక్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.

తమిళనాడు చెందిన మనితి సంస్థ మహిళల బృందం శబరిమల వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలను భక్తులు అడ్డుకున్నారు. ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో పంబా బేస్ క్యాంప్‌నకు చేరుకున్న 11 మంది మహిళలను అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకుంది. మహిళల రాకను పసిగట్టిన భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని నిరసన తెలియజేయగా, పోలీసులు వారికి రక్షణ కల్పించారు. ఈ మహిళలను ఎట్టిపరిస్థితుల్లో శబరిమలలోకి అడుగపెట్టనివ్వబోమని భక్తులు స్పష్టం చేశారు. ఈ మహిళలంతా 50 ఏళ్లలోపు వారే కావడంతో శబరిమల సన్నిధానంలోకి వెళ్లడానికి వీల్లేదని భక్తులు పట్టుబట్టారు. అయ్యప్ప శరణుఘోషతోనే భక్తులు నిరసన తెలుపుతూ, మహిళలను వెళ్లనీయకుండా పంబా వద్ద బైఠాయించారు.

శరణుఘోషను నిలిపివేసి, అడ్డుతప్పుకోవాలని పోలీసులు అనేకసార్లు హెచ్చరించినా వారు మాత్రం కదల్లేదు. మహిళలతో సహా పోలీసులు ఆరు గంటలకు పైగా వేచిచూశారు. అయినా సరే ఆందోళనకారులు వెనక్కు తగ్గకపోవడంతో శబరిమల వెళ్లాలనే ప్రయత్నాన్ని మనితి సభ్యులు విరమించుకున్నారు. దీంతో ఆ మహిళలు కేరళ సరిహద్దులు దాటేవరకు భద్రత కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. శబరిమలకు బయలుదేరిన రెండో బృందాన్ని కూడా ఎరుమేలిలో అడ్డుకున్నారు. అలాగే కోయంబత్తూరు నుంచి బయలుదేరిన మూడో బృందాన్ని కూడా త్రిసూర్ వద్ద నిలిపివేసి వెనక్కు పంపనున్నారు.

మరోవైపు, భక్తుల ఆందోళనలతో శబరిమలలో యుద్ధ వాతావరణం నెలకుంది. అయితే, 11 మంది మహిళల్లో ఆరుగురు మాత్రమే దర్శనం కోసం వెళ్లేందుకు ప్రయత్నించగా, మిగతా ఐదుగురు వీరికి రక్షణగా వచ్చామని తెలిపారు. మరోవైపు శబరిమల సన్నిధానం పరిధిలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు చేపట్టరాదని, ఇవి డిసెంబరు 27 వరకు అమల్లో ఉంటాయని అధికారులు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం స్వామిని దర్శించుకోడానికి వచ్చిన తమిళనాడు బృందంలోని మహిళలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని శబరిమల కర్మ సంస్థ ఆరోపించింది. వీరిలో చాలా మంది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ విషయం తెలిసినా పోలీస్ అధికారులు రక్షణ కల్పించడమేంటని మండిపడింది.