
కుమారి మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ తాతగారు ‘హామిల్టన్’ ఐర్లండులోని స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఐర్లండు ఇంగ్లండులో భాగమైనా ఆంగ్లేయ నిరంకుశ పరిపాలను వ్యతిరేకంగా ఐర్లాండులో స్వాతంత్ర ఉద్యమం 19వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. తాతగారిద్వారా ఈ ఉద్యమప్రభావం కుమారి నోబుల్ వ్యక్తిత్వంపై పడింది.
1898లో మార్గరెట్ నోబుల్ భారతదేశానికి వచ్చిన తరువాత స్వామి వివేకానందుడు మంత్రదీక్షను ఇస్తున్న సందర్భంగా “నీవు ఏజాతికి చెందినదానివి?” అని అడిగారు. ఆశ్చర్యంగా నివేదిత తాను ఆంగ్లేయుల జాతికి చెందిన దానినని చెప్పారు. అప్పటికి ఆమెకు ఇంగ్లండు దేశం మీద ఇంకా ప్రేమ పోలేదని స్వామీజీ అర్థంచేసుకున్నారు. అయినా వారు మౌనంగానే ఉన్నారు. భారత ఇంగ్లండుదేశాలు పరస్పరం స్నేహంతో ఉండేట్లు చేయటం ఆనాటి ఆమె జీవన స్వప్నం. కొంతకాలానికి సోదరి నివేదిత వివేకానందునితో ఆమె విదేశీ స్నేహితురాళ్ళతో కలిసి ఉత్తరభారతదేశ యాత్రకు వెళ్ళారు.
కాశ్మీరులో ఒక మఠాన్ని, ఒక సంస్కృత పాఠశాలను ప్రారంభించాలన్నది స్వామి వివేకానందుల కోరిక. దానికి ఆనాటి కాశ్మీర్ మహారాజు అంగీకరించారు. తాత్కాలికంగా ఒక స్త్రీల మఠం కూడా ప్రారంభమైంది. అక్కడి కౌలుదారు సర్ అడాల్బర్ట్ టాల్బోట్ ఈ ప్రస్థావనను వీటో చేయటంతో బ్రిటీష్ కౌన్సిల్ ఆ స్థలాన్ని స్వామీజీకి ఇవ్వడానికి తిరస్కరించారు. దానితో నివేదిత హృదయం గాయపడింది. మొదటిసారిగా భారతదేశంలో పరాయి పాలనవల్ల జరుగుతున్న హాని నివేదితకు అర్థమైంది. వివేకానందుని బోధనలవల్ల భారతదేశంపై సోదరి నివేదితకు ప్రేమ మరింతగా పెరిగింది.
1901వ సం||లో ఆమె అమెరికాలో పర్యటిస్తున్నారు. భారతీయ నాయకుడైన బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసం చెబుతున్నప్పుడు అక్కడివారు, “ముందు మీదేశానికి స్వాతంత్రం సంపాదించండి. ఆ తరువాత మాతో మీ మతం గురించి, మీ తత్వశాస్త్రం గురించి మాట్లాడండి. అప్పుడు మేం వింటాం” అని అన్నారు. ఈ మాటల ప్రభావం నివేదిత మనసుపై పడింది. భారతదేశానికి స్వాతంత్ర్యం ఎంత అవసరమో ఆమెకు అవగతమైంది. ఆ స్వాతంత్ర్యేచ్చ ఆమెలో ప్రబలంగా నాటుకుపోయింది. అమెరికాలో, ఇంగ్లండులో భారతదేశంపట్ల వారికున్న చిన్నచూపు కూడా నివేదితకు బాధను కలిగించింది.
డా॥ జగదీష్ చంద్రబోస్ పరిశోధనలు, ఆవిష్కరణలకుగానూ పారిస్లో వారికి గౌరవమర్యాదలు లభించాయి. దీనికి విరుద్ధంగా ఇంగ్లండులోని శాస్త్రవేత్తలు బోసును అణగద్రొక్కటానికి ప్రయత్నం చేశారు. వారి పరిశోధనలను తస్కరించటానికి ప్రయత్నం చేశారు. ఆనాడు డా॥ బోస్ కు స్వదేశంలో కూడా తగిన సహకారం లేదు.
జంషెడ్జీ టాటా ఒక భారతీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని పెట్టిన అర్జీని బ్రిటీష్ ప్రభుత్వం త్రోసిపుచ్చింది. శ్రీమతి అనిబిసెంట్ బెనారస్ లో ఒక హిందూ కళాశాలను ప్రారంభించటానికి కూడా ఆంగ్లేయ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. 1901 లండన్ పర్యటన సందర్భంగా రష్యాదేశపు విప్లవకారుడైన ప్రిన్సి క్రోపోట్కీని నివేదిత కలుసుకున్నారు. ఆయనతో అనేక విషయాలు చర్చించారు. వారు వ్రాసిన పరస్పర సహాయం (మ్యూచువల్ ఎయిడ్) అనే పుస్తక ప్రభావం ఆమెపై ప్రబలంగా పడింది. ఫలితంగా భారతదేశానికి రాజకీయ స్వాతంత్రం చాలా అవసరమని ఆమె దృఢ నిర్ణయానికి వచ్చారు.
1902 జులై4వ తేదీన స్వామీజీ సమాధి పొందారు. తన మనస్సులో ఏర్పడిన నూతన ఆలోచనలను రామకృష్ణా మఠపు స్వామీజీలతో ఆమె చర్చించారు. “నా అభిమతం నేను చేయవలసిన పని జాతిమొత్తాన్ని జాగృతం చేయటం. అంతేకానీ కొద్దిమంది స్త్రీలను ప్రభావితం చేయటం కాదు. స్వామీజీ బోధించిన మానవ నిర్మాణమనే ఆదర్శం నివేదిత దృష్టిలో జాతి నిర్మాణంగా రూపుదాల్చింది. రామకృష్ణామఠం రాజకీయాలకు దూరంగా నడవవలసిన సంస్థ. దానితో జులై 19, 1902న రామకృష్ణమఠం ఒకవార్తను ప్రకటించింది. సోదరి నివేదిత స్వతంత్రురాలు. ఆమె కార్యకలాపాలకు మఠంనుండి ఎటువంటి తీర్మానాలు, అధికారాలు అవసరంలేదు. తన కార్యక్రమాలను స్వతంత్రంగా నిర్వహించుకునే అధికారం ఆమెకు ఉంటుంది.
ఇంతవరకు నివేదిత తన పేరును శ్రీరామకృష్ణ సంఘ నివేదిత అని సంతకం చేసేవారు. అప్పటినుండి శ్రీరామకృష్ణ నివేదిత అని మాత్రమే వ్రాశారు. ఆ తరువాత కాలంలో రామకృష్ణ – వివేకానంద నివేదిత అని వ్రాయసాగారు. అయినప్పటికీ మఠంతో సత్సంబంధాలను కొనసాగించారు.
భారత స్వాతంత్ర ఉద్యమంలో సోదరి నివేదిత పాత్ర
1902 నుండి చివరి వరకూ సోదరి నివేదిత దేశమంతా అనేకసార్లు పాఠశాల నిర్వహిస్తూనే విస్తృతంగా పర్యటించారు. తన పర్యటనలో హిందూ ధర్మాన్ని గురించి ప్రచారం చేయటంతో పాటుగా దేశ స్వాతంత్రము స్వదేశీ ఉద్యమాల గురించి విస్తృతంగా ప్రసంగించారు. 1904 అక్టోబర్ 4న నాగపూర్లో యువకుల క్రికెట్ ఆటలపోటీల బహుమతి ప్రధాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడ ఆమె ప్రసంగిస్తూ, “మీరు విదేశీ క్రీడలపై మోజు చూపించటం నాకు బాధగా ఉంది. మీకు స్వదేశీ ఆటలు రావా? మరాఠీ శౌర్య ప్రతాపాలను, వారి క్రీడలను మీరు ఈ భోన్సేరాజుల రాజధానిలో ప్రదర్శిస్తారని నేను ఆశపడ్డాను.” అంటూ వారిని ఎత్తిపొడిచారు.
1904 మార్చి 20న బుద్ధగయలో ఆసియాలో మహ్మదీయ మతం అనే అంశంపై నివేదిత ప్రసంగించారు. “మహ్మదీయుల ఆక్రమణ శకం ముగిసింది. ఇప్పుడు మీరు భారతీయ ముస్లింలు. మీ తక్షణ కర్తవ్యం మీరు భారత భూమితో మిమ్మల్ని మీరు ఏకీకరించుకోవటమే. మహ్మదీయులు దేశ అభివృద్ధిలో తమవంతు పాత్రను అందించటంలో విఫలమయ్యారు. భరతభూమి ముస్లింల జన్మభూమిగా మారింది. కాబట్టి మీరు జాతీయ స్వాతంత్య్ర ఉద్యమంలోకి దుమికి, భారత జాతి నిర్మాణంకోసం కంకణం కట్టుకోవాలి” అని ప్రసంగించారు.
రాజకీయ ఆందోళనలు:
1904వ సం||లో లార్డ్ కర్జన్ ఒక నూతన విశ్వవిద్యాలయ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీనికి ఆనాటి భారతీయ మేధావులు నిరసన వ్యక్తంచేశారు. తన నిరసనను తీవ్రంగా వ్యక్తంచేస్తూ సోదరి నివేదిత బాంకిపూర్లో చేసిన ప్రసంగం బీహార్ హెరాల్డ్ పత్రికలో ప్రచురిత మయ్యింది. తన ప్రసంగాలలో ఆమె దేశం, జాతి, జాతీయత అనే పదాలను మంత్రాలుగా పలుమార్లు చెప్పేవారు. జాతీయ చైతన్యం అనే మాటను మొదటిసారిగా ఆమే ప్రయోగించారు.
అనేక యువజన సంఘాలను సమన్వయం చేస్తూ శ్రీ సతీష్ చంద్ర ముఖర్జీ ‘డాన్ సంఘాన్ని’ ప్రారంభించారు. 1905లో జాతీయ కళాశాల ప్రారంభించబడింది. అదే సమయంలో అనేక విప్లవ సంఘాలను కలుపుతూ ‘అనుశీలన సమితి’ ఏర్పడింది. ఈ అనుశీలన సమితికి శ్రీ మిత్ర అధ్యక్షుడు, అరవిందుడు ఉపాధ్యక్షుడు. ఈ సమితికి నివేదిత తన పుస్తకాలను అందజేశారు. ఇందులో ఐరిష్ విప్లవం, తిరుగుబాటు చరిత్ర, అమెరికా స్వాతంత్య్ర ఉద్యమం, డచ్ రిపబ్లిక్ చరిత్ర, మాజినీ గారీ బాల్డి జీవిత చరిత్రలు వంటి అనేక పుస్తకాలు ఉన్నాయి. అనేకమంది స్వాతంత్య్ర ఉద్యమనాయకులు గల ఈ సంస్థలన్నింటితో సోదరి నివేదిత దగ్గర సంబంధాలను కలిగి ఉంది. ఆనాడు స్వాతంత్య్ర ఉద్యమం కోసం పనిచేస్తున్న అందరితో సోదరి నివేదిత సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది.
బెంగాల్ విభజనకు లార్డ్ కర్జన్ నిర్ణయించాడు. దానికి నిరసనగా జరిగిన ఉద్యమాలలో సోదరి నివేదిత చురుగ్గా పాల్గొన్నారు. సెప్టెంబరు 20, 1905లో నివేదిత గోపాలకృష్ణ గోఖలేకు ఉత్తరం వ్రాస్తూ “ఆడవాళ్ళు, పూజారులు కూడా విదేశీ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. వారు చేస్తున్న త్యాగం అద్భుతమైనది.” అంటూ శ్లాఘించారు. ఆమె విదేశీ వస్తువులను బహిష్కరించారు. తన పాఠశాలలో వందేమాతర గీతాన్ని ప్రార్థనా గీతంగా జోడించారు. 16 అక్టోబర్, 1905న ‘ది ప్రబాషి’ (ప్రవాసి) పత్రిక సంపాదకుడైన శ్రీ రామానంద చటర్జీకి ఉత్తరంవ్రాస్తూ “బెంగాల్ విభజన చట్టం అమలయ్యే రోజది. దేశసమైక్యత అవసరాన్ని మరింతగా మనం వ్యాప్తిచేయాలి. ఆ దృష్టితో నేడు మనం రక్షాబంధన్ ఉత్సవం నిర్వహించుకోవాలి” అని వ్రాశారు.
1905, 25 డిసెంబరు కాంగ్రెస్ జాతీయ సభలు గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షతన వారణాసిలో జరిగాయి. సభలలో నివేదిత హాజరు కాకపోయినా తిలభండేశ్వర్ వసతి గృహంలో ఆనాటి ప్రముఖ నాయకులతో ఆమె రోజూ సమావేశం అయ్యేవారు. సభాధ్యక్షుడు శ్రీ గోఖలేకు మనసులో ఇష్టంలేకపోయినా పాల్గొన్న సభ్యుల కోరిక మేరకు వందేమాతరగీతం పూర్తిగా సరళాదేవి చౌధురాని పాడారు. దీనిపై నివేదిత శ్లాఘించారు కూడా. 1906లో కలకత్తా కాంగ్రెస్ సమావేశాలకు ఆమె వారణాసి సభలవలె హాజరయ్యారు. మితవాదులు, అతివాదుల పేరుతో విడిపోవడం, సంఘర్షించుకోవడం తగదని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరుతో వ్రాసిన వ్యాసంలో ఆమె పేర్కొన్నారు.
దేశానికి ఒక జాతీయ పతాకం అవసరం అని భావించి తన పాఠశాల విద్యార్థినులచే సింధూరము, పసుపు వర్ణాలతో కూడిన ఒక జెండాను దానిపై వజ్రాయుధాన్ని చిత్రించి తయారుచేసి 1906, కాంగ్రెస్ సభలలో ప్రదర్శింపచేశారు. దాని చిత్రాలు మోడ్రన్ రెవ్యూపత్రికలో ప్రచురింపబడ్డాయి. 1906 బారిసాల్ కాంగ్రెస్ సమావేశాన్ని బ్రిటీష్ ప్రభుత్వము భగ్నం చేసింది. దీనితో రాజకీయ ఉద్యమం క్రమంగా విప్లవాత్మకమార్గంగా మారిపోయింది. 1907 సూరత్ కాంగ్రెస్ సమావేశం తరువాత కాంగ్రెస్ అతివాదుల చేతులలోకి వెళ్ళిపోయింది. బారిసాల్ సమావేశాన్ని భగ్నంచేయటంతోపాటు బ్రిటీష్ ప్రభుత్వం కలకత్తా బెంగాల్లో అణచివేత చర్యలను చేపట్టింది.
1910 జనవరిలో శ్రీ అశ్వనీకుమార్ దత్తా, తదితరులు కారాగారం నుండి విడుదల చేయబడ్డారు. ఆ వార్త విని నివేదిత ఎంతో సంతోషించారు. ఆరోజు తన పాఠశాలకు సెలవును ప్రకటించి పాఠశాల ఆవరణమంతా మంగళప్రదమయిన అరటిఆకులతో, తోరణాలతో అలంకారం చేశారు. జైలుపాలయిన ఉద్యమకారుల కుటుంబసభ్యులను కలిసి వారి బాధలలో పాలుపంచుకున్నారు.
అరవిందుడు అనేక విప్లవ ఉద్యమాలకు కేంద్రబిందువు అని ఆంగ్లేయులు భావించి వారిని అరెస్టుచేయటం కోసం నిర్ణయించారు. ఆయన ఆ రాత్రి ‘కర్మయోగిన్’ పత్రిక కార్యాలయంలో ఉన్నారు. ఆంగ్లేయ ప్రభుత్వం తనను అరెస్టు చేయబోతోంది అన్న విషయం తెలిసి రాత్రికి రాత్రే ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న చందర్ నాగోర్ కు వెళ్ళిపోయారు. తాను నడుపుతున్న కర్మయోగిన్ పత్రికను నిర్వహించమని సోదరి నివేదితకు ఆయన సందేశం పంపించారు. 14, 27 ఫిబ్రవరి 1910లో రెండుసార్లు సోదరి నివేదిత చందర్ నాగోరు వెళ్ళారు. ప్రభుత్వం కర్మయోగిన్ పత్రికను మూసివేసేంతవరకు మూడు నెలలపాటు సోదరి నివేదితే పత్రిక నిర్వహించారు. ఇలాంటి అనేక సంఘటనలతో సోదరి నివేదిత కదలికలపై పోలీసుల నిఘా పెరిగింది. ఆమెకు వచ్చే అన్ని ఉత్తరాలు సోదా అయ్యేవి. ఇలా తన ప్రసంగాలద్వారా తన వ్యాసాలద్వారా తన సాహిత్యం ద్వారా సోదరి నివేదిత స్వాతంత్య్ర ఉద్యమ ప్రేరణను కలిగించారు.
వివిధ రంగాలలో స్వదేశీ దృక్పధం:
1898లో మొదటిసారిగా నివేదిత కలకత్తాకు వచ్చినప్పుడు ఆమె కూడా ఒక క్రైస్తవ మిషనరీ అనుకుని రవీంద్రనాధ్ ఠాకూర్ తన పిల్లలకు ఆంగ్ల భాషను బోధించవలసిందిగా కోరారు. నివేదిత అంగీకరించలేదు. భారతీయ బాలలకు వారివారి జాతీయ ఆదర్శాలను, భాషలను నేర్పాలని విదేశీ ఆదర్శాలను, ప్రమాణాలను రుద్దరాదని ఆమె స్పష్టంగా తిరస్కరించారు. నివేదిత ఈ భావాలు చూసి రవీంద్రుడు మొదట ఆశ్చర్యపోయినా తరువాత సోదరి నివేదిత పట్ల ఆకర్షితులయ్యారు.
శాస్త్రీయ రంగంలో భారతదేశం:
పారిస్ లో ఉండగా 1901లో డా॥ జగదీష్ చంద్రబోస్ తో నివేదితకు పరిచయమయ్యింది. వారి పరిశోధనలపట్ల ఆకర్షితురాలయ్యింది. ఆనాటి ఆంగ్లేయ ప్రభుత్వం అనేక విధాల ఆయనను ఇబ్బంది పెట్టటం గమనించి డా॥ జగదీష్ చంద్రబోస్ కు జీవితాంతం ఆమె అండగా నిలిచింది. 1902 నుండి 1907 వరకు వారి పరిశోధనలను గ్రంథస్థం చేయటంలో, ముద్రింపజేయటంలో ఆమె ఎంతో సమయం వెచ్చించింది. ఆర్థికంగా ఎంతో సహకరించింది. వారి కుటుంబంతో సన్నిహితురాలైంది. భారతదేశంలో ఒక పరిశోధనా సంస్థను ఏర్పాటుచేయాలని ఆ సంస్థద్వారా దేశీయ శాస్త్రజ్ఞులకు అవసరమైన సహాయంచేయాలని నివేదితకు ఒక కోరిక ఉండేది. ఈ విషయాన్ని డా॥ జగదీష్ చంద్రబోస్ తో తరచూ చర్చించేవారు. 1911లో సోదరి నివేదిత తనువు చాలించారు. అనంతరం 1917లో నివేదిత ఆశించిన శాస్త్రీయ సంస్థను డా॥ జగదీష్ చంద్రబోస్ ప్రారంభించారు. ఆ పరిశోధనా సంస్థ నిర్మాణంలోకి అడుగుపెట్టగానే ఎదురుగా తొట్టెలో తామరలు ఉంటాయి. దానికన్నా ఎత్తుగా ఒక స్త్రీమూర్తి విగ్రహం ఉంటుంది. ఆ స్త్రీమూర్తి చేతిలో జపమాల, మరో చేతిలో కాగడా ఉంటాయి. సోదరి నివేదిత అస్థికల పాత్రను అక్కడ ఉంచారు. అక్టోబరు 7, 1937న డా॥ జగదీష్ చంద్రబోస్ శాస్త్రీయ రంగంలో భారతదేశం ఎలా ఉండాలని కోరుకున్నారో ఆ వివరాలను మిస్టర్ హెర్బరు వ్రాసిన ఉత్తరంలో పేర్కొన్నారు. జగదీష్ చంద్రబోస్ తన వీలునామాలో కేటాయించిన ఒక లక్షరూపాయిలతో డా|| బోస్ మరణానంతరం శ్రీమతి బోస్ ‘బాణీభవన్’ అనే స్త్రీ సంక్షేమ సంస్థలో సోదరి నివేదిత పేరున ఒక సమావేశమందిరాన్ని నిర్మించారు. శ్రీ దినేష్ సేన్ అనే రచయిత “బెంగాలీ భాష, సాహిత్యాల చరిత్ర” అనే పుస్తకాన్ని ఆంగ్లంలో వ్రాశారు. ఈ వ్రాతప్రతిని ప్రతిపుటా పరిశీలించి సరిదిద్దడానికి సోదరి నివేదిత ఒక సంవత్సరంపాటు కృషిచేశారు.
సామాజిక శాస్త్రానికి, ఆర్థిక శాస్త్రానికి సంబంధించి నివేదిత ఎంతో స్పష్టమైన, స్థిరమైన ఆలోచనలను కలిగిఉండేవారు. భారతదేశ రాజకీయ ఆర్థికశాస్త్రాన్ని గురించి పశ్చిమదేశ భావాలతో కాకుండా భారతీయ దృక్పధంతో వ్రాయాలని నివేదిత ఎన్నో వ్యాసాలలో నిర్ద్వంద్వంగా వ్రాశారు. శ్రీ రమేష్ చంద్ర దత్తా ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త. బరోడా ప్రభుత్వసేవలో పనిచేసేవారు. సోదరి నివేదిత ప్రేరణతో దత్తా ఆర్థికచరిత్ర పుస్తకాన్ని వ్రాశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలను, సంక్లిష్ట పరిస్థితులను తెలుసుకోవాలనే యువతకు దత్తా వ్రాసిన పుస్తకాన్ని చదవమని సోదరి నివేదిత సిఫారసు చేసేవారు.
భారతీయ చిత్రకళ:
భారతదేశంలోని కళలు ఇక్కడికి ప్రాకృతమైనవని, ప్రాచీనమైనవని, గ్రీసునుండి ఉద్భవించినవి కావని సోదరి నివేదిత గట్టిగా చెప్పారు. చిత్రకళ యొక్క పునర్జీవనం జాతీయ నిర్మాణానికి అత్యావశ్యకమని సోదరి నివేదిత నమ్మారు. 1907లో “ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్స్” అనే సంస్థను ప్రారంభించటంలో ఆమె ప్రత్యక్షపాత్ర ఎంతో ఉంది. అబనీంద్ర టాగూర్, నందలాల్ బోస్, సురేంద్రనాధ్ గంగూలీ, అసిత్ కుమార్ హల్దార్, వెంకటప్పా, ఆంనద కుమారస్వామి, గగనేంద్రనాధ టాకూర్, సర్దాన్ ఉడ్రఫ్, ఓసి గంగూలీ వంటివారు ఈ సంస్థనిర్మాణంలో కీలకపాత్ర నిర్వహించారు. 1950లో భారత రాజ్యాంగం తయారైన తరువాత భారతీయ చరిత్రను వ్యక్తంచేసే వివిధ చిత్రాలను భారత రాజ్యాంగపు ప్రతిపై చిత్రీకరించిన ఘనత శ్రీ నందలాల్ బోస్ ది. ఆయన నివేదిత నుండి ప్రేరణ పొందినవాడే.
మహిళా విద్యలో అనేక స్వదేశీ ప్రయోగాలను తన పాఠశాలలో చేసి చూపించిన సుదీర్ఘ చరిత్ర నివేదితకు ఉంది. ఇలా అనేక రంగాలలో స్వదేశీ ఉద్యమానికి దిశాదర్శనం చేసిన ఒక మేధావి ఆమె.
నివేదిత మరణించిన తరువాత సంస్మరణ సభలో ప్రసంగించిన వక్తల ప్రసంగాలలోని ముఖ్య అంశాలు :
డా॥ రాస్ బిహారీ బోస్ :
ఎండుటెముకలలో ఇప్పుడు కదలికలు వస్తున్నాయంటే కారణం సోదరి నివేదిత వాటిలో ఊపిరి ఊదడమే! ఈనాడు మన దేశ యువకులు ఎంతో ఉత్తేజంతో ఒక కొత్త, గొప్పదైన, సత్యవ్రతమైన, ఉన్నత జీవితంకోసం తపిస్తున్నారంటే దానికి కారణం సోదరి నివేదిత చేసిన కార్యక్రమాలే.
శ్రీ గోపాలకృష్ణ గోఖలే
సోదరి నివేదిత భారతమాత పిలుపు విని వచ్చారు. ఈనాడు ఎన్నో లోపాలతో లోటుపాట్లతో ఉన్న భారతదేశాన్ని కూడా ఆమె తన అక్కున చేర్చుకున్నారు. ఇక్కడ ఎదురయ్యే కష్టాలను, కడగండ్లను చూసి ఆమె బెదిరిపోలేదు. మన అజ్ఞానాన్ని, మూఢనమ్మకాలను చివరికి మన అపరిశుభ్రతను చూసికూడా ఆమె అసహ్యించుకోలేదు.
రవీంద్రనాధ్ ఠాకూర్
సోదరి నివేదిత “నా ప్రజలు” అన్నమాటలను పలికినప్పుడు ఆ గొంతులో వినిపించిన స్వచ్ఛమైన, ప్రేమజనితమైన, వాత్సల్య పూర్వకమైనభావం మనలో మరెవరినోటా వినిపించలేదు. ఆమె దేశంకోసం హృదయాన్నే సమర్పించింది.





