News

దేశ‌ద్రోహి అల్తాఫ్‌ హుస్సేన్‌ హరూన్ అరెస్ట్‌

375views
  • ఏపీ ఇంటెలిజెన్స్ ఘ‌న‌త‌

గోద్రా: దేశ భద్రత రహస్యాలను నౌకాదళ అధికారులు పాకిస్థాన్‌కు అమ్ముకుంటున్న కేసులో గుజరాత్‌లోని గోద్రా నగరంలో ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ నగరంలోని మొహమ్మదీ మొహల్లా ప్రాంతానికి చెందిన అల్తాఫ్‌ హుస్సేన్‌ హరూన్‌ను అరెస్టు చేసి గోద్రా సెషన్స్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ట్రాన్సిట్‌ రిమాండు మంజూరు చేయడంతో అతడిని విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురానున్నారు. అతడి వద్ద వివిధ కంపెనీలకు చెందిన పలు సిమ్‌కార్డులు ఉన్నాయి. వివిధ పాకిస్థానీ ఉగ్రవాద సంస్థలతో అతడికి సంబంధం ఉందని, వాళ్ల కోసమే ఇతడు భారతీయ సిమ్‌కార్డులు తీసుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

భారతీయ భద్రతాదళాలకు వలపు వల విసిరేందుకు వాట్సప్‌ కోసం ఇతడి వద్ద ఉన్న ఫోన్లకు వచ్చే ఓటీపీలు ఉగ్ర‌వాదులు వాడుకునేవారు. ఆ వాట్సప్‌ ద్వారానే వలపువల సందేశాలు పంపేవారు. 2016లో తాను పాకిస్థాన్‌ వెళ్లి, అక్కడ 26 రోజులు ఉన్నట్టు హరూన్‌ పోలీసు విచారణలో వెల్లడించాడు. ఆ సమయంలో పాకిస్థానీ ఇంటెలిజెన్స్‌ వర్గాలతో పాటు, ఉగ్రవాద సంస్థల నేతలనూ కలిశాడు.

హరూన్‌తో పాటు మరో ఐదుగురిని ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ప్రతినిధులు భారత నౌకాదళంలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని సామాజిక మాధ్యమాల్లో పరిచయం చేసుకుని వారికి వలపు వల విసిరి, వారి ద్వారా దేశభద్రత రహస్యాల్ని తెలుసుకుంటున్న విషయం 2019 డిసెంబరులో ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం గుర్తించి కేసు నమోదు చేసింది. విశాఖ గూఢచర్య రాకెట్‌ కేసుగా ఇది పేరొందింది. దాని దర్యాప్తు బాధ్యతల్ని ఆ తర్వాత ఎన్‌ఐఏ చేపట్టింది. ఈ కేసులో గోధ్రాకు చెందిన వారినే ఎన్‌ఐఏ అప్పట్లో అరెస్టుచేసింది. తాజాగా అదే ప్రాంతంలో అరెస్టు జ‌ర‌గ‌డం చర్చనీయాంశమైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి