
-
10 లక్షల టన్నుల బొగ్గు నిల్వకు జెన్ కో యత్నం
న్యూఢిల్లీ: వేసవిలో పెరిగే విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని థర్మల్ ప్లాంట్ల దగ్గర కనీసం 10 లక్షల టన్నుల బొగ్గును నిల్వ చేయాలని జెన్‌కో నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కేంద్రం ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత దృష్ట్యా వచ్చే నిల్వలు రోజువారీ విద్యుత్ ఉత్పత్తికే సరిపోతున్నాయి. వాతావరణ మార్పులతో నవంబరు రెండో వారం తర్వాత విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని అధికారుల అంచనా.
దీనికితోడు బహిరంగ మార్కెట్‌లో చౌక విద్యుత్ అందుబాటులోకి వస్తుందని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. అప్పటి నుంచి థర్మల్ ఉత్పత్తి తగ్గించి జనవరి నాటికి బొగ్గు నిల్వలను పెంచుకునేలా ప్రణాళిక రూపొందించింది. బొగ్గు సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉత్పత్తి సంస్థల బకాయిలు, రైలు రవాణా ఛార్జీల చెల్లింపు కోసం రూ.600 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వేసవిలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 230 ఎంయూలకు చేరే అవకాశం ఉందని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి.





