ముంబై: ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అక్రమమన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు ఎన్‌సీబీ ఇచ్చిన సమాధానంతో దిమ్మ దిరిగింది. ఓ క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకుని, నిషేధిత డ్రగ్స్‌నూ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అరెస్టు అయిన వారిలో నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు.
ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చేందుకు ముంబయి కోర్టు నిరాకరించింది. అతడితో పాటు అర్బాజ్ మర్చంట్, మూన్‌మూన్ దమేచాలను ముంబయి సిటీ కోర్టు ఈ రోజు(ఈ నెల 7) వరకు ఎన్సీబీ కస్టడీకి అనుమతించింది. విచారణ నిమిత్తం 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ ను ముంబై కోర్టు గురువారం వరకు డ్రగ్స్ నిరోధక ఏజెన్సీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కస్టడీకి అప్పగించింది.
అయితే, ఈ అరెస్టుపై మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రూయిజ్ నౌకలో ఎన్‌సీబీ చేసిన దాడులు నకిలీవని… అసలక్కడ డ్రగ్సే దొరకలేదని కొట్టిపారేశారు. షారుఖ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు నెలక్రితమే తమకు సమాచారం అందిందన్నారు. క్రైం రిపోర్టర్ల గ్రూపులో ఈ విషయం చక్కర్లు కొట్టిందన్నారు.
క్రూయిజ్ నౌకలో ఎన్‌సీబీ దాడి సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని, వారిలో ఒకరు బీజేపీ నేత అని ఆరోపించారు. ఆర్యన్ అరెస్ట్ అక్రమమన్న ఆయన.. దీని వెనక బీజేపీ కార్యకర్తల హస్తం ఉందన్నారు. సోదాల సమయంలో ఉన్న కేపీ గోసావి, మనీశ్ భానుషాలి ఎవరని ప్రశ్నించారు. వారక్కడ ఎందుకు ఉన్నారో బీజేపీ, ఎన్‌సీబీ సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. వీరితో బీజేపీ నేతలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
నవాబ్ మాలిక్ ఆరోపణలపై తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్పందించింది. మంత్రి వ్యాఖ్యలు ద్వేషపూరితంగా, పక్షపాతంతో కూడుకున్నట్టు కనిపిస్తున్నాయని పేర్కొంది. నవాబ్ మాలిక్ అల్లుడు డ్రగ్స్ కేసును ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఆయనీ వ్యాఖ్యలు చేసి ఉంటారని.. మంత్రి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని తేల్చి పడేసింది.
Source: NationalistHub