
అమరావతి: ఇక నుంచి విద్యార్థులకు అమరావతి అంటే తెలియకపోవచ్చును. చదవులో కాకుండా ప్రత్యేకించి గ్రంథాలయాలు లేదా ముందు తరం వారి నుంచి అమరావతి చరిత్రను తెలుసుకోవల్సివుంటుంది. ఎందుకంటే, ఈ ఏడాది ఏపీ సర్కార్ పదో తరగతి పుస్తకంలో ఉన్న అమరావతి పాఠాన్ని తొలగించింది. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ఆయా బడులకు సరఫరా చేసింది.

2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా.. సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించింది. విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను తీసుకుని కొత్త వాటిని అందించాలని ఉపాధ్యాయులకు సూచించింది. కానీ.. పాత పుస్తకాల ప్రకారం బోధించిన ఉపాధ్యాయులు రెండో పాఠమైన ‘అమరావతి’ని ఇప్పటికే చెప్పేశారు.
Source: EtvBharat





