News

ఖడ్గమృగం కొమ్ములు దేనికీ పనికిరావు

383views
  • హిందూ సాంప్ర‌దాయంలో కొమ్ముల దహనం

  • వేటగాళ్లకు అసొం ప్రభుత్వం బలమైన సందేశం

గౌహతి: ఖడ్గమృగం కొమ్ముల పొడిని ఉపయోగించి సాంప్రదాయ చైనీస్‌ ఔషధాలను తయారు చేస్తారనే నమ్మకంతో స్మగ్లర్లు ఖడ్గమృగాలను చంపి, ఆ జంతువు కొమ్ములు దొంగలించడం ప్రారంభించారు. దీంతో ఆ జాతి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో మేల్కొన్న అసొం ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఖడ్గమృగం కొమ్ముల వల్ల ఎటువంటి ఔషధాలు తయారుకావని, ఇదంతా ఒట్టి అపోహే అని తెలియజేబుతూ సెప్టెంబర్‌ 22, ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బహిరంగంగా వేలాది ఖడ్గమృగాల కొమ్ములను దహనం చేసింది.

హిందూ ఆచారంలో దహన సంస్కారాలను నిర్వహించింది. మనదేశంలో అసొంలో అధికంగా ఖడ్గ మృగాలు మరణించాయి. కొన్ని వేటగాళ్ల కారణంగా మరణించగా.. ఇంకొన్ని సహజంగా మరణించాయి. అలా చనిపోయిన వాటి కొమ్ములను అధికారులు సేకరించి పెట్టారు.

కాజీరంగ జాతీయ ఉద్యానవనంలోని బోకాఖట్‌లో 2,479 ఒంటి కొమ్ము ఖడ్గమృగాల కొమ్ములను అక్కడి అధికారులు బహిరంగంగా దగ్దం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కొమ్ములను సేకరించే పని దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. వాటిని అటవీ శాఖ ఆధీనంలో రాష్ట్ర ట్రెజరీలలో ఉంచారు. ముఖ్యంగా, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ చేపట్టిన ‘రైనో హార్న్‌ రీ-వెరిఫికేషన్‌’ కార్యక్రమంలో భాగంగా వీటిని స్మగ్లర్ల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గత వారం రాష్ట్ర మంత్రివర్గం కొమ్ముల దహనం చేయనున్నట్లు తమ నిర్ణయాన్ని ప్రకటించింది.

రైనో కొమ్ములకు ఎలాంటి ఔషధ ప్రాముఖ్యత లేదని వేటగాళ్లకు బలమైన సందేశం ఇవ్వడం కోసం అస్సాం ప్రభుత్వం ఇలా చేసింది. ఖడ్గమృగాల కొమ్ముల్లో ఔషధ గుణాలు ఉంటాయన్న నమ్మకంతో ప్రజలు వాటిని వేటాడుతున్నారు. ఫలితంగా ఖడ్గమృగాల సంఖ్య తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఉన్న అపోహలను పోగొట్టి, ఖడ్గమృగాలను సంరక్షించేందుకు ప్రభుత్వం ఈ కొమ్ములను కాల్చివేసింది.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి