ArticlesNews

మన సమస్యలకు మందు మన పెరట్లోనే ఉంది

160views

సంస్కృతీ సాంప్రదాయాలకు, ఉత్తమ నైతిక విలువలకు, ప్రవర్తనకు పుట్టినిల్లు భారతదేశం. వలస పాలకుల రాకతో పాశ్చాత్య నాగరికతకు ఇక్కడ బీజం పడింది. తెల్ల తోలు వాడు మన కంటే అధికుడని, తెలివైన వాడని, ఆధునికుడని, నాగరికుడని భావించి కొందరు ఉన్నత వర్గాల వారు ముఖ్యంగా రాజ కుటుంబాలు, జమీందారీ కుటుంబాలు, ఇతర సంపన్న వర్గాల వారు గ్రుడ్డిగా ఆంగ్లేయులను అనుకరించడం మొదలు పెట్టారు. వారిలాగే వస్త్రాలు ధరించటం, ఆంగ్లం నేర్చుకోవటం, విదేశాలకు (ముఖ్యంగా ఇంగ్లాండుకు) వెళ్ళి చదువుకోవటం, పాశ్చాత్యుల వలె మద్య పానము, ధూమ పానము చెయ్యడం వగైరా వగైరాలన్నమాట.

భారతదేశంలో ఆంగ్ల విద్య ప్రవేశించిన తర్వాత ఈ ధోరణి ఉన్నత మధ్య తరగతి వారికి కూడా ప్రాకింది. అయినప్పటికీ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వారిలో అత్యధికులు విద్యాధికులే. అదీ ఆంగ్ల విద్యను అభ్యసించిన, విదేశాలలో విద్యార్జన చేసిన వారే. అయితే వారిలో ఎక్కువ మందికి భారతీయులు అనాగారికులనీ, ఆంగ్లేయులతో పోల్చినపుడు అధములనే భావన ఉండేది. అలాగే ఆంగ్లేయుల పాలనా విధానమే మిన్న అయినదనే భావన కూడా ఉండేది. ఆ కారణం చేతనే స్వాతంత్ర్యానంతరం కూడా ఆంగ్లేయులు చూపి వెళ్ళిన దారిలోనే మన ప్రభుత్వాల పాలన సాగింది.

భారతీయ సంస్కృతిని నాశనం చెయ్యడానికి ఆంగ్లేయులు వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఆంగ్ల విద్యా విధానాన్ని గానీ, చరిత్ర వక్రీకరణను గానీ పట్టించుకోకుండా, మార్పులకు పూనుకోకుండా అప్పటి ప్రభుత్వాలు ఆంగ్లేయ ప్రభుత్వ విధానాలను యదావిధిగా కొనసాగించాయి. అదే సమయంలో తమకు ప్రభుత్వంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి NCERT లాంటి నిర్ణయాత్మక సంస్థలలోనూ, మీడియాలోనే కాక దాదాపు దేశంలోని అన్ని రంగాలలో తిష్ట వేసుక్కూర్చున్న కమ్యూనిష్టులొకవైపు, దేశం లోపల, వెలుపల హిందూత్వ వినాశనం కోసం పని చేసే అన్ని సంస్థలు, వ్యక్తుల వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉండే క్రైస్తవ మత మార్పిడి ముఠాలు మరో వైపు అన్నీ కలిసి, వెరసి భారతీయ సంస్కృతికి వారసులైన హిందువులలో తమ సంస్కృతి పట్ల, సాంప్రదాయాలు, ఆచారాల పట్ల విశ్వాసం సన్నగిల్లేలా చేశాయి.

వేల సంవత్సరాలుగా భారతీయుల వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక నైతిక వర్తనకు ఆధారమైన కట్టుబాట్లు, విలువల పతనం ప్రారంభమైంది. దాని పర్యవసానమే చిత్ర విచిత్ర వస్త్రధారణలు, కిస్సాఫ్ లవ్వులు, రేవ్ పార్టీలు, విశృంఖల వేలం వెఱ్ఱి చేష్టలు. దాని పర్యవసానమే పబ్బులు, క్లబ్బులు, బెట్టింగులు, రేసులు, డ్రగ్సు వగైరా వగైరాలు. వీటితోపాటు ప్రేమ పెళ్ళిళ్ళు, ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చెయ్యడాలు, అమ్మెయ్యడాలు, లవ్ జీహాద్లు ఇలా సమాజంలో ఏర్పడిన వికృతులకు అంతే లేదు.

అయితే ఇవన్నీ గతంలో పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలు, విశ్వవిద్యాలయాలు, సంపన్నులకు మాత్రమే పరిమితమై ఉండేవి. కానీ నేడు ఎగువ, దిగువ మధ్య తరగతులను దాటి పేదవారి గూటిలోకి కూడా ఈ వికృతులు చేరుతున్నాయి. చిన్న నగరాలను దాటి పల్లెలకు, కార్పోరేట్ కళాశాలలను దాటి మండల కేంద్రాలలో ఉండే కళాశాలలు, పాఠశాలలకు కూడా చేరుతున్నాయి.

ఉదాహరణకు మొన్న విశాఖ, నిన్న నెల్లూరు, ఇవాళ వియవాడలలో నమోదైన డ్రగ్స్ కేసులు. ఏపీలో సైతం డ్రగ్స్ మాఫియా పడగవిప్పుతోంది. మొన్నటి వరకు ప్రధాన నగరాలకే పరిమితమైన మాదక ద్రవ్యాలు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు సైతం చేరుతున్నాయి. అయితే ఈ డ్రగ్స్ వాడుతున్నవారిలో అధిక శాతం విద్యార్ధులు, యువత ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నవ్యాంధ్రలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న విశాఖ, నెల్లూరు, కృష్ణా జిల్లాలు అన్ని రంగాల్లో ముందున్నాయి. అదే సమయంలో ఈ జిల్లా యువతలో విదేశీ విష సంస్కృతి వేళ్ళూనుకుంటోంది.

యువత మత్తులో జోగుతోంది. పబ్బులు క్లబ్బుల కల్చర్ విజయవాడ లాంటి మహానగరాలను దాటి నూతన రాజధాని ప్రాంతంగా గుర్తింపు పొంది అభివృద్ధి చెందుతున్న మంగళగిరి, తాడేపల్లి వంటి ప్రాంతాలకు కూడా పాకింది. ఆధునికత పేరుతో యువతీ యువకులు నడిరోడ్డుపై అర్ధనగ్నంగా తిరుగుతూ ఎక్కడపడితే అక్కడ మద్యం సేవిస్తూ నానా హంగామా చేస్తున్నారు. బైకు రేసుల పేరుతో రహదారులపై అలవికాని వేగంతో ద్విచక్ర వాహనాలను తోలుతూ ఇతర వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. మండలాల్లోని వివిధ గ్రామాలలో యువత పుట్టినరోజు వేడుకల పేరుతో నడిరోడ్డుపై బర్త్ డే పార్టీలు జరుపుకుంటూ మందు తాగి చిందులేస్తున్నారు. అర్ధరాత్రి వరకు యువతీ యువకులు మద్యం మత్తులో నడిరోడ్డుపై తిరగడం, పెద్ద పెద్దగా కేకలు వేయడం, హారన్లు మోగించడం, అటువైపుగా వెళుతున్న ద్విచక్ర వాహనదారులను, ఇతరులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. బహిరంగంగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నెల్లూరు, విశాఖలలో సైతం ఇలాంటి పరిస్థితే ఉంది.

ఈ మధ్య విజయవాడలో డ్రగ్స్‌ విక్రయ ముఠా గుట్టురట్టయింది. డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇద్దరు నైజీరియన్ల తోపాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద హెరాయిన్‌, 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్లు కేఎల్‌ యూనివర్సిటీలో విద్యార్థులు. అలాగే నెల్లూరులో కూడా పోలీసులు అరెస్టు చేసిన డ్రగ్స్ విక్రయ ముఠాలో ఇద్దరు నైజీరియన్ యువకులున్నారు. ఇలా విద్యాలయాలలో వివిధ దేశాల, రాష్ట్రాల విద్యార్ధులుండడంతో వారి ద్వారా కూడా యువతలో విష సంస్కృతి నిండుతోంది.

ఇక స్మార్ట్ ఫోన్ల వల్ల జరుగుతున్న డ్యామేజి సంగతి చెప్పనలవికాదు. తాను డ్రగ్స్ కి అలవాటు పడటమే కాకుండా, తన స్నేహితులకు కూడా డ్రగ్స్ ను అలవాటు చేసి చెన్నై నుంచి వారికి డ్రగ్స్ ను సరఫరా చేస్తూ మాదక ద్రవ్యాల వ్యాపారిగా మారిన నెల్లూరుకు చెందిన సాదిక్ అనే విద్యార్థి మొదట తన చేతిలోని స్మార్ట్ ఫోన్ ద్వారానే చెన్నైలో జరిగే రేవ్ పార్టీ వివరాలు తెలుసుకున్నాడట. స్మార్ట్ ఫోన్లతో ఎంత ప్రయోజనముందో అంతకంటే ఎక్కువ అనర్థమూ ఉంది. ఇలా యువత పెడదోవ పట్టడానికి కర్ణుడి చావుకు మల్లే కారణాలనేకం.

అయితే మనం తప్ప యావత్ప్రపంచమూ గుర్తించిన ఒక సత్యమేమిటంటే సమాజంలో, కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో నిత్యం ఎదురయ్యే సమస్యలకు, సంక్షోభాలకు ఉన్న ఏకైక పరిష్కారం హిందూ జీవన విధానం. అది మన అనుష్ఠానం కావచ్చు, మన వివాహ వ్యవస్థ కావచ్చు, సామాజిక కట్టుబాట్లు కావచ్చు, యోగా కావచ్చు ఇవే, నిక్కముగా ఇవే మనల్ని వ్యక్తిగతంగా, కౌటుంబికంగా, సామాజికంగా, నైతికంగా ఉన్నతంగా, ఉదారంగా నిలిపాయి. మనం హిందువులుగా జీవించగలిగితే…. నిజంగా హిందూ సాంప్రదాయాలను, ఆచారాలను, కట్టుబాట్లను తు.చ తప్పకుండా పాటించగలిగితే…. ఇప్పుడు మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి ఇట్టే పరిష్కారం చిక్కుతుంది. అవును హిందూ జీవన విధానమే మనల్ని వ్యక్తిగతంగా నియంత్రించి కుటుంబ బంధాలలో బాధ్యతలను ఎరుక పరచి, సామాజిక కట్టుబాట్లతో ‘ఒరులేయవి ఒనరించిన అప్రియములు మనకగునో… ఒరులకు అవి చేయకునికి పరమ ధర్మ”మని తెలిపి, ఒక మంచి కొడుకుగా, భర్తగా, పౌరునిగా ప్రకృతికి, పక్కవారికి అనుకూలంగా నడిపిస్తుంది. “ధర్మో రక్షతి రక్షితః”. హిందూ బంధువులారా ఇకనైనా కళ్ళు తెరవండి. మన సమస్యలకు మందు మన పెరట్లోనే ఉంది.

– శ్రీరాంసాగర్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.